చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం

Chile Attempted 32 million dollers airport heist leaves two dead - Sakshi

శాంటియాగో: చిలీ రాజధాని శాంటియాగోలో వందల కోట్ల నగదును దోచుకునేందుకు సాయుధ దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. అమెరికాలోని మియామి నుంచి శాంటియాగో విమానాశ్రయానికి బుధవారం చేరుకున్న విమానంలో 32 మిలియన్‌ డాలర్ల (రూ.262 కోట్ల) నగదు ఉంది. బ్యాంకుల్లో పంపిణీ చేయాల్సిన ఆ నగదును ట్రక్కులోకి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో, 10 మంది సాయుధ దుండగులు ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించారు. పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అడ్డుకున్న భద్రతా సిబ్బందితో కొద్దిసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో భద్రతా సిబ్బంది ఒకరు, ఒక దుండగుడు చనిపోయారు. దుండగులు వెంటనే తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన మరో రెండు వాహనాలు కనిపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి ఈ భారీ దోపిడీని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగదును తీసుకువచ్చిన లాతమ్‌ విమానంలోని ప్రయాణికులకు ఎటువంటి అపాయం కలగలేదన్నారు. ఇదే శాంటియాగో ఎయిర్‌పోర్టులో గతంలో రెండుసార్లు దోపిడీ దొంగలు తెగబడి మొత్తం 25 మిలియన్‌ డాలర్ల నగదును ఎత్తుకెళ్లారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top