Carbon Dioxide Suction Factory: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది - Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది

Published Thu, Sep 9 2021 12:02 PM

Carbon Dioxide Sucker Factory Established In Iceland - Sakshi

పర్యావరణ కాలుష్యానికి కార్బన్‌ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్‌లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది.
 

ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్‌ల్యాండ్‌లో బుధవారం(సెప్టెంబర్‌ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్‌ల్యాండిక్‌ పదం. ఇంగ్లిష్‌ మీనింగ్‌ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్‌ బాక్స్‌ల సెటప్‌తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన క్లైమ్‌వర్క్స్‌, ఐస్‌ల్యాండ్‌కు చెందిన కార్బ్‌ఫిక్స్‌ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి.
 

ఎలా పని చేస్తుందంటే..
ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్‌ ఉద్గారాలతో సమానమని యూఎస్‌ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్‌ మెటీరియల్‌ సాయంతో వాయువును ఫిల్టర్‌ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్‌గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్‌ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్‌ క్యాప్చుర్‌ అండ్‌ స్టోరేజ్‌(CCS) ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు.

చదవండి: రియల్‌మీ ట్యాబ్‌! ఇవాళ్టి నుంచే..

Advertisement
Advertisement