Canadian PM: రహస్య ప్రదేశంలోకి కెనడా ప్రధాని?!

Canadian PM And His Family Moved To Secret Location - Sakshi

ఒట్టోవా: దేశరాజధానిలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఆయన కుటుంబాన్ని భద్రతా బలగాలు రహస్య ప్రాంతానికి తరలించాయని మీడియా కథనాలు వెల్లడించాయి. దేశంలో కరోనా టీకా తప్పనిసరని వ్యతిరేకించే నిరసనకారులు భారీగా రాజధాని ఒట్టోవాకు చేరుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా అధికారులు ప్రధానిని, ఆయన కుటుంబాన్ని రహస్యప్రాంతానికి పంపినట్లు తెలుస్తోంది. 

‘‘ఫ్రీడం కాన్వాయ్‌’’ పేరిట జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా పలువురు ట్రక్కు డ్రైవర్లు భారీ ట్రక్కులతో రాజధానికి ర్యాలీగా బయలుదేరారు. సరిహద్దుల నుంచి దేశంలోకి వచ్చే ట్రక్కు డ్రైవర్లకు తప్పక టీకా సర్టిఫికెట్‌ ఉండాలని కెనెడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పలువురు ట్రక్కు డ్రైవర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా నిబంధనలను వ్యతిరేకించేవారు ఈ ట్రక్కర్లకు మద్దతునిస్తున్నారు. వీరంతా శనివారం భారీ సంఖ్యలో రాజధానికి చేరారు. టీకా తప్పనిసరి నిబంధనలు, ప్రజారోగ్య నిబంధనలు తొలగించాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారని సీబీసీ(కెనెడా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌) తెలిపింది. నిరసనకారులు ట్రూడోకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని మెయిల్‌ న్యూస్‌ తెలిపింది.  

యుద్ధవీరుల స్మారకానికి అవమానం
నిరసనకారుల్లో కొందరు ప్రఖ్యాత వార్‌ మెమోరియల్‌పైకి ఎక్కి డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. దీన్ని కెనడా మిలటరీ ఉన్నతాధికారి జనరల్‌ వేన్‌ ఈరె, రక్షణ మంత్రి అనితా ఆనంద్‌ తీవ్రంగా ఖండించారు. సైనికుల సమాధులపై నిరసనకారులు నృత్యాలు చేయడం తనను ఎంతో బాధిస్తోందని వేన్‌ చెప్పారు. తరాల క్రితం సైనికులు పోరాడింది  ప్రజల హక్కుల కోసమని, ఇలాంటి నిరసనల కోసం కాదని హితవు పలికారు.

వీరంతా సిగ్గుతో తలవంచుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన సమర్థనీయం కాదని అనితా ఖండించారు. ఇవి కెనడియన్లకు పవిత్ర స్థలాలని, దేశం కోసం పోరాడినవారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. రాజధాని వీధుల్లో దాదాపు పదివేల మంది చేరిఉండొచ్చని, భారీగా హింస జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని గతంలోనే ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేశారు. అయితే నిరసనకారులు చాలా స్వల్పమని, మెజార్టీ దేశస్తులు వీరితో ఏకీభవించరని చెప్పారు.  

ఇస్లామోఫోబియాను వ్యతిరేకిద్దాం!
దేశంలో పెరిగిపోతున్న ముస్లిం వ్యతిరేకత సహించరానిదని ప్రధాని ట్రూడో అభిప్రాయపడ్డారు. దేశంలో పెరిగే ఇస్లామోఫోబియాను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తామని ఆదివారం ప్రకటించారు. కెనడా ముస్లింల పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు ముగింపు పలకాలని, తద్వారా వారికి రక్షణ కల్పించాలని కోరారు. దేశంలోని ముస్లిం సమాజానికి భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని క్యుబెక్‌ సిటీ మసీదుపై దాడి జరిగి ఐదేళ్లవుతున్న సందర్భంగా పాటించే నేషనల్‌ డే రోజున ప్రభుత్వం ప్రకటించింది. ట్రూడో ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్వాగతించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top