బౌద్ధ గురు థిక్‌ నాక్‌ హాన్‌ మృతి

Buddhist Guru Thich Nhat Hanh passed away - Sakshi

దలైలామా సహా ప్రముఖుల సంతాపం

హనోయ్‌: ప్రముఖ బౌద్ధ గురువు, జెన్‌ సన్యాసి థిక్‌ నాక్‌ హాన్‌ 95 సంవత్సరాల వయసులో శనివారం మరణించారు. పశ్చిమ దేశాల్లో జెన్, బౌద్ధిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం. థిక్‌ నాక్‌ హాన్‌ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వియత్నాంలోని టు హైయు పగోడాలో ఆయన చివరి శ్వాస విడిచారు. 1926లో జన్మించిన థిక్‌ నాక్‌ హాన్‌ 16ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. 1961లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. 1966లో మార్జిన్‌ లూథర్‌ కింగ్‌ (జూ)తో పలు విషయాలపై చర్చలు జరిపారు. వియత్నాం అంతర్యుద్ధం నివారణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన మార్టిన్, థిక్‌నాక్‌ పేరును నోబెల్‌ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు.

ఆ సమయంలో ఆయన తిరిగి వియత్నాం రాకుండా నిషేధం కూడా విధించారు. దీంతో ఫ్రాన్స్‌లో నిర్మించిన ప్లమ్‌ విలేజ్‌లో ఆయన ఎక్కువకాలం గడిపారు. జెన్‌ బుద్ధిజం ముఖ్యాంశాలను ఆయన విరివిగా ప్రచారం చేశారు. 2014లో ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చింది. 2018లో ఆయన వియత్నాంకు వచ్చి చివరి వరకు అక్కడే కాలం గడిపారు. కరేజ్‌ ఆఫ్‌ కన్సైస్‌ (1991), పసెమ్‌ ఇన్‌ టెర్రిస్‌ పీస్‌ అండ్‌ ఫ్రీడం(2015) అవార్డులు ఆయన్ను వరించాయి. 2017లో ఎడ్యుకేషన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హాంకాంగ్‌ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్‌ ఆఫ్‌ 5 పవర్స్‌ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కొన్ని చిత్రాల్లో, డాక్యుమెంటరీల్లో కనిపించారు. ఆయన మరణం తనను బాధిస్తోందని బౌద్ధ గురు దలైలామా విచారం వ్యక్తం చేశారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top