
లండన్: దేశాన్ని వణికిస్తున్న ఇంధన కొరత సమస్యను తీర్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించనుంది. సుమారు 200 మంది మిలటరీ వ్యక్తులను తాత్కాలిక ఇంధన సరఫరాకోసం నియోగించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇంధన కొరత కారణంగా పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దేశంలో ట్రక్ డ్రైవర్ల కొరత కారణంగా ఇంధన రవాణా కుంటుపడింది.
ఆపరేషన్ ఎస్కాలిన్ పేరిట ఈ సమస్య పరిష్కారానికి మిలటరీ నుంచి కొందరిని నియమిస్తున్నామని, వీరు ప్రస్తుతం ట్రైనింగ్‌లో ఉన్నారని, సోమవారం నుంచి ఇంధన సరఫరా బాధ్యతలు చేపడతారని డిఫెన్స్ కార్యదర్శి డెన్ వాలెస్ చెప్పారు. ఈ వారంలో ఇంధన సమస్య చాలావరకు తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా సమస్య కనిపిస్తూనే ఉంది. సమస్య తీవ్రత క్రమంగా తగ్గుతోందని ప్రభుత్వం తెలిపింది.