వీడియో: క్రేన్‌కు భారీ ‘రాకాసి’ చేప.. విలయం తప్పదంటూ వణుకుతున్న జనాలు

Bad Omen Big Fish Viral Fishermen catch Chile - Sakshi

వైరల్‌: మనిషి నమ్మకం ఒక బలం. మూఢనమ్మకం మనిషిలోని బలహీనత. అయితే.. కొన్ని విషయాలను నమ్మితీరాలని వాదిస్తుంటారు పెద్దలు. అందుకు గతంలోని కొన్ని విషయాలను తెరపైకి తెస్తుంటారు. ఓ భారీ సముద్ర జీవి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. భారీ చేపను కొందరు ముచ్చటగా ఫోన్లలో చిత్రీకరిస్తుంటే.. చాలామంది మాత్రం అటువైపు చూడకుండానే వెళ్లిపోతున్నారు. 

చిలీలో స్థానికులు ఈ మధ్యే పదహారు అడుగుల పొడవున మాన్‌స్టర్‌ చేపను పట్టుకున్నారు. అరికా నగరంలో.. ఈ కోలోసాల్‌ ఓర్‌ఫిష్‌(రోయింగ్‌ ఫిష్‌) దర్శనమిచ్చింది. సాధారణంగా అవి సముద్రపు లోతుల్లో ఉంటాయి. కానీ, ఇలా పైకి రావడం మంచిది కాదని నమ్ముతున్నారు అక్కడి జనాలు. ఈ మేరకు క్రేన్‌కు వేలాడుతున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇది చెడుకి సంకేతమని, సునామీ, భూకంపాలు వస్తాయని భయంతో వణికిపోతున్నారు. 

డిజాస్టర్‌ ఫిష్‌..
ఈ తెడ్డు చేపకు విపత్తుల చేప అని పేరు ఒకటి ముద్ర పడింది. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే ఈ రాకాసి చేప.. నీటిలోని భూగర్భ కదలికల తర్వాతే పైకి వస్తాయట. ఆ తర్వాత భారీ భూకంపం, సునామీ ముంచుకొస్తుందని నమ్ముతున్నారు వాళ్లు. అంతేకాదు పట్టుకున్న వాళ్లకు శాపం తగులుతుందనే నమ్మకం ఉంది. చిలీలోనే కాదు.. జపాన్‌, సముద్రపు తీరం ఉన్న దేశాల్లోనూ ఇలాంటి కథలు జోరుగానే ప్రచారం అయ్యాయి. అంతెందుకు అలా కనిపించిన తర్వాతే.. ఫుకుషిమాలో భూకంపం సంభవించిందని, 20 వేల మందిని బలి తీసుకుందని నమ్ముతున్నారు. 

పాపం.. చేప
వీటిని సముద్రపు భారీ పాములు, సముద్ర రాక్షసి చేప అనే కథలు ఈ ఓర్ఫిష్ మీద ప్రచారం అవుతుంటాయి. కానీ, సైంటిఫిక్‌ కోణంలో పాపం అవి ప్రమాదకరమైనవి అసలే కావు. ఏనాడూ అవి మనుషులపైగానీ, పడవలపైగానీ దాడి చేసిన దాఖలాలు లేవు. జబ్బు పడినప్పుడు, చనిపోయినప్పుడు, పిల్లలను కనేటప్పుడు మాత్రమే నీటి అడుగు నుంచి పైకి వస్తాయి. ఒక్కోసారి తుఫానులు, బలమైన అలల ధాటికి కూడా కొట్టుకు వస్తాయి. ఓర్ఫిష్ చేపలు నాచు, పాచిని తింటాయి. అంతెందుకు వాటికి నిజమైన దంతాలు కూడా లేవు. బదులుగా.. చిన్న చిన్న చేపలను మింగడానికి గిల్‌ రేకర్స్‌ అని పిలువబడే వ్యవస్థ ఉంటుంది. వాటి జీర్ణవ్యవస్థకు చిన్న ద్వారం మాత్రమే ఉంటుంది. పైకి నీటిని చిమ్ముతుంటే.. చూడడానికి మాత్రమే అదొక భయంకరమైన జీవిగా కనిపిస్తుంది అంతే. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top