బైడెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటన.. షాకిచ్చిన మూడు దేశాలు

Arab Leaders Meeting With Joe Biden Cancelled Over Gaza Attack - Sakshi

అమ్మాన్‌: గాజాపై ఇజ్రాయెల్‌ సేనలు విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అహ్లీ సిటీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరోవైపు.. యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బుధవారం పర్యటించనున్నారు.

గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో బైడెన్‌ చర్చలు జరుపనున్నారు. గాజాకు సాయం అందించేందుకు ఓ ప్రణాళికను రూపొదించేందుకు ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించారు. 

ఇదిలా ఉండగా.. జో బైడెన్‌కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా దేశాలు షాక్ ఇచ్చాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వస్తున్న బైడెన్‌తో తాము భేటీ అయ్యేది లేదని వెల్లడించాయి. అయితే, గాజా యుద్ధాన్ని ఆపే లక్ష్యంతో  ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌లతో  తమ దేశ రాజధాని అమ్మాన్‌  వేదికగా బుధవారం సదస్సును నిర్వహించాలని జోర్డాన్ భావించింది. ఈ సమావేశానికి హాజరవుతానని బైడెన్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

మంగళవారం అర్ధరాత్రి గాజాలోని అల్ అహ్లీ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వందలాది మంది రోగులు చనిపోవడంతో.. జోర్డాన్‌లో ఆందోళనలు మిన్నంటాయి. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించిన జోర్డాన్ రాజు అబ్దుల్లా ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఈ సమాచారాన్ని అమెరికా కూడా ధ్రువీకరించింది. ఇక, జోర్డాన్ విదేశాంగ మంత్రి అయ్మన్ సఫాది కూడా దీనిపై ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టర్కీలోని నాటో కార్యాలయం దగ్గర కూడా నిరసనలు వెల్లువెత్తాయి. గాజాకు సాయం అందించాలని ప్రజలు టర్కీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top