
ఐదుగురు జర్నలిస్టులు సహా 20 మంది మృతి
మృతుల్లో అసోసియేటెడ్ ప్రెస్ జర్నలిస్ట్ మరియం దగ్గా
దెయిర్ అల్–బలాహ్: గాజా దక్షిణ ప్రాంతం ఖాన్‌యూనిస్‌లోని నాస్సెర్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ సోమవారం భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ)తరఫున ఫ్రీలాన్సర్‌గా పనిచేసే మరియం దగ్గా(33) సహా ఐదుగురు జర్నలిస్టులతోపాటు కనీసం 20 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఆస్పత్రి సిబ్బంది, పౌరులుక్షతగాత్రులుగా మిగిలారు.
గాజాలోని హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి మరియం యూకే పత్రిక ఇండిపెండెంట్ అరబిక్ వెర్షన్ అయిన ఇండిపెండెంట్ అరబిక్ వంటి వార్తా సంస్థల తరఫున కూడా పనిచేశారు. ఆమె ప్రధానంగా నాస్సెర్ ఆస్పత్రి కేంద్రంగా విధులు కొనసాగిస్తున్నారు. ఆమె మరణంపై ఏపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరియం ఇటీవలే నాస్సెర్ ఆస్పత్రిలో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిపై కథనం వెలువరించారు.
యుద్ధం ప్రారంభం కాకమునుపే తన 12 ఏళ్ల కుమారుడిని గాజా నుంచి వేరే ప్రాంతానికి పంపించారు. నాస్సెర్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో మహ్మద్ సలాం అనే జర్నలిస్ట్ కూడా చనిపోయారని అల్‌జజీరా ధ్రువీకరించింది. దాడిలో తమ కాంట్రాక్ట్ కెమెరామన్ హుస్సం అల్–మస్రి మృతిచెందగా కాంట్రాక్ట్ ఫొటోగ్రాఫర్ హతెమ్ ఖలీద్ గాయపడ్డారని రాయిటర్స్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన మరో జర్నలిస్ట్ మోత్ అబూ తహా కూడా ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
22 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 192 మంది జర్నలిస్టులు చనిపోగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 18 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్(సీపీజే)తెలిపింది. గాజా స్ట్రిప్‌లో హమాస్‌తో జరుగుతున్న పోరుపై అంతర్జాతీయ మీడియా కవరేజీని ఇజ్రాయెల్ నిషేధించింది.
దీంతో, ప్రము ఖ వార్తాసంస్థలన్నీ గాజా లోని పాలస్తీనా జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగానే అక్కడి పరిణామాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నాయి.
తాజా ఘటనను పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. జర్నలిస్టులే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడికి తెగబడిందని అల్‌జ జీరా మండిపడింది. జెనీవా ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని ఆరోపించింది. ఇలాంటి దృశ్యాలు గాజాలో ప్రతిరోజూ కనిపించేవేనని ఐరాస ప్రతి నిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్ ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం జరిగిందిదే..
నాస్సెర్ ఆస్పత్రి భవన సముదాయంలోని నాలుగో అంతస్తుపై ముందుగా ఇజ్రాయెల్ ఆర్మీ క్షిపణిని ప్రయోగించింది. భవనం తీవ్రంగా దెబ్బతినడం ఒక్కసారిగా జనం హాహాకారాలు చేయడంతో ఎమర్జెన్సీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే అక్కడే మరోసారి ఇజ్రాయెల్ మరో క్షిపణిని ప్రయోగించింది. ఆస్పత్రి బాల్కనీలో జరల్నిస్టులుండే ప్రాంతంపైనే సరిగ్గా ఈ దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.
ఘటనలో తమ పౌర సహాయకుడొకరు చనిపోయారని గాజా సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఘటనపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేపడతామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఏ లక్ష్యంతో ఆస్పత్రిపై దాడి జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. రెండు వారాల క్రితం గాజా నగరంపై జరిగిన ఇజ్రాయెల్ ఆర్మీ దాడిలో అల్‌జజీరాకు చెందిన అన్సాస్ అల్ షరీఫ్ సహా పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ రాకెట్ విభాగానికి అల్ షరీఫే నాయకుడని ఇజ్రాయెల్ ఆరోపించింది.