మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు

Another Black Shot Dead In Washington DC  Body Cam Footage Released - Sakshi

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో మరోసారి ఒక నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపారు. ఇందుకు సంబంధించిన బాడీ కెమెరా ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు. 18 ఏళ్ల డియోన్ కే అనే యువకుడిని పోలీసులు వెంబడించి అతని  ఛాతీలో కాల్చారు. అతనిని ఒక వీధి రౌడీగా పోలీసులు పేర్కొన్నారు. ఈ వీడియోలో పోలీసులు ఒక అపార్ట్‌మెంట్‌ దగ్గరకు కారులో వెళతారు. అప్పుడు అక్కడి నుంచి ఒక వ్యక్తి పరిగెడుతూ కనిపిస్తాడు. అతడిని వెంటాడిన ఒక పోలీసు అధికారి అతని ఛాతీలో కాలుస్తాడు. వెంటనే అతను  కింద పడిపోతాడు. అక్కడ కొంచెం సేపు వీడియో బ్లర్‌గా కనిపిస్తోంది. తరువాత కొంతసేపు వీడియో ఆగిపోతుంది. తరువాత డియోన్ కే తన చేతిలో ఉన్న గన్‌ను దూరంగా విసురుతాడు. అది దూరంగా ఉన్న గడ్డిలో పడుతుంది.

ఇంకో పోలీస్‌ ఆఫీసర్‌ గడ్డిలో ఆ గన్‌ కోసం వెతుకుతాడు. అయితే ఆ గన్‌ కెన్‌ ఉన్న ప్రదేశం నుంచి 96 మీటర్ల దూరంలో పడిందని, అంత దూరం పడటం అసాధ్యమని కొంత మంది తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డియోన్ కే చేతిలో ఆ గన్‌ ఎందుకు ఉంది,  దానిని ఉపయోగించి పోలీసులపై దాడి చేయాలనుకున్నాడా లేదా గన్‌ను విసిరేయాలనుకున్నాడా అన్నది ఆ వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు. నల్లజాతీయుల మీద దాడులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడంతో పలువురు నల్లజాతీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కాల్చి చంపిన  పోలీసు అధికారిని  2018 లో డిపార్ట్‌మెంట్‌లో చేరిన అలెగ్జాండర్ అల్వారెజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని  అడ్మినిస్ట్రేటివ్ సెలవులో ఉంచారు. కేసును విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ అనే నల్లజాతీయుడిని చంపడంతో  అమెరికాలో గతంలో నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

చదవండి: పోలీసు సంస్కరణలకు ట్రంప్‌ ఓకే

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top