అబార్షన్‌పై ఆ దేశాల్లో ఆమెకే హక్కు.. అ‍క్కడ మాత్రం కఠిన ఆంక్షలు

Abortion Rules Across The World - Sakshi

సరిగ్గా మూడు నెలలు క్రితం అగ్రరాజ్యమైన అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్లపై రాజ్యాంగబద్ధంగా మహిళలకు వచ్చిన హక్కుల్ని తోసిపుచ్చుతూ తీర్పు చెప్పడం సంచలనం సృష్టించింది. 1973లో రియో వర్సెస్‌ వేడ్‌ కేసు ద్వారా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కుని 50 ఏళ్ల తర్వాత కొట్టేసింది. ఫలితంగా కొన్ని పరిమితుల మధ్య అబార్షన్‌ చేయించుకునే దేశాల జాబితాలో చేరిపోయింది.

అయితే అమెరికాలో రాష్ట్రాలే శక్తిమంతం కావడంతో ఆయా రాష్ట్రాల నిబంధనల ఆధారంగా మహిళలకు అబార్షన్‌పై హక్కులు వస్తాయి. యూరప్‌ దేశాల్లో అబార్షన్‌ చేయించుకోవడం అత్యంత సులభమైతే, ఆఫ్రికా దేశాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. చైనాలో 1953 నుంచి అబార్షన్‌ చట్టబద్ధం. జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో 1970 తర్వాత  బలవంతపు అబార్షన్లని కూడా ప్రోత్సహించింది. ఇప్పుడు వృద్ధులు పెరిగిపోతూ ఉండడంతో అనవసరంగా అబార్షన్‌ చేయించుకోవడానికి వీల్లేదంటూ గత ఏడాది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

యూరప్‌ దేశాల్లో...  
యూరప్‌లోని అత్యధిక దేశాల్లో మహిళలకు గర్భ విచి్ఛత్తిపై హక్కులున్నాయి. 12–14 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకోవడం పూర్తిగా మహిళల ఇష్టమే. ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, వేల్స్‌లో 1967లో చట్టం చేశారు. 24 వారాలవరకు అబార్షన్‌ చేయించుకోవచ్చు. యూకేలో గర్భంలో శిశువు సరిగా ఎదగలేదని తేలితే ఎన్నో నెలలో అయినా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకి ఉంది. కెనడాలో గర్భవిచ్ఛిన్నానికి ప్రత్యేకంగా చట్టం లేకపోయినప్పటికీ ఏ దశలోనైనా అబార్షన్‌ చేయించుకోవచ్చు.

యూరప్, లాటిన్‌ అమెరికా సంప్రదాయ కేథలిక్‌ దేశాల్లో కూడా మహిళా కార్యకర్తల ఉద్యమాలతో అబార్షన్‌పై హక్కులు కల్పించారు. గత ఏడాది కొలంబియాలో 24 వారాల్లోపు అబార్షన్‌ చేయించుకోవడం చట్టబద్ధం చేశారు. ఐర్లాండ్‌లో అబార్షన్‌ చట్టాలకు పరిమితులు విధించడంపై 2018లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మహిళలు తిరస్కరించారు. 12 వారాల్లో ఎప్పుడైనా అబార్షన్‌ చేయించుకునే హక్కు వారికి ఉంది. న్యూజిలాండ్‌లో 2020లోనే మహిళలకు అబార్షన్లపై హక్కులు వచ్చాయి.  

24 దేశాల్లో అబార్షన్‌ చట్టవిరుద్ధం  
ప్రపంచంలోని 24 దేశాల్లో అబార్షన్‌ చేయించుకోవడం చట్టవిరుద్ధం. వీటిలో అత్యధికంగా ఆఫ్రికా దేశాలుంటే ఆసియా, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌కు చెందిన దేశాలు వీటిలో ఉన్నాయి.  సెనగల్, మార్షినియా, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పైన్స్, ఎల్‌ సాల్వోడర్, హోండరస్, పోలాండ్, మాల్టాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్‌ చేయించుకోలేరు. కొన్ని దేశాల్లో అబార్షన్‌ చేయించుకుంటే కఠినమైన శిక్షలు కూడా ఉంటాయి. ఎల్‌ సాల్వేడర్‌లో మహిళలు అబార్షన్‌ చేయించుకుంటే దోషిగా నిర్ధారించి జైలు శిక్ష కూడా విధిస్తారు. పోలాండ్‌ గత ఏడాదే అబార్షన్లపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది.పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన వయసులో ఉండే ప్రపంచ మహిళా జనాభాలో 5% మంది ఈ 24 దేశాల్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల మందికి మహిళలకి అబార్షన్‌ చేయించుకునే హక్కు లేదని సెంటర్‌ ఫర్‌ రీప్రొడక్టివ్‌ రైట్స్‌ సంస్థ నివేదికలో వెల్లడైంది.   

50 దేశాల్లో పరిమితులతో హక్కులు  
దాదాపుగా 50 దేశాల్లో అబార్షన్‌ చేయించుకునే హక్కు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులున్నాయి. లిబియా, ఇండోనేసియా, నైజీరియా, ఇరాన్, వెనిజులాలో తల్లి ప్రాణాలు ప్రమాదం ఉంటే మాత్రమే అబార్షన్‌ చేయించుకోచ్చు. మిగిలిన దేశాల్లో అత్యాచారం, అవాంఛిత గర్భధారణ, గర్భంలో శిశువు ఎదుగుదలలో లోపాలుంటే అబార్షన్‌ చేయించుకోవడానికి అనుమతినిస్తారు. బ్రెజిల్‌లో అత్యాచారం వల్ల గర్భం వచి్చనా, గర్భస్థ పిండం ఎదగకపోయినా గర్భస్రావానికి అనుమతిస్తారు కానీ వైద్యులు, వైద్య రంగంలో కనీసం ముగ్గురు అనుమతి తప్పనిసరి.
- సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top