
పోర్ట్‌మోర్స్బీ: పపువా న్యూ గినియాలో కొండచరియలు భారీ బీభత్సాన్ని సృష్టించాయి. శుక్రవారం(మే24) సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో తొలుత 100 మందికిపైగా మృతి చెంది ఉండొచ్చని భావించారు.
అయితే మృతుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా అంచనా వేసింది. ఈ విపత్తులో సుమారు 670 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని ‘అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎమ్)’తెలిపింది.
గ్రామాలకు గ్రామాలే కొండచరియల కింద కూరుకుపోయినట్లు సమాచారం. మొత్తం 150 ఇళ్లు కొండ చరియల కింద శిథిలమయ్యాయని తేలింది. దీంతో 670 మంది సమాధి అయ్యారని అంచనా వేస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.