వివాదాల పరిష్కారానికి 3మార్గాలు

3 Ways to Resolve Disputes in the American Parliamentary System - Sakshi

అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఏర్పడే వివాదాల పరిష్కారానికి అమెరికన్‌ పార్లమెంటరీ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా పరిష్కరించుకోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు, హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతిస్తుంది.

ఈ మూడు మార్గాలపై సంక్షిప్తంగా...
2020 ఎన్నికల్లో డెమొక్రాట్లు అధికులు మెయిల్‌ ద్వారా ఓట్లు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రిపబ్లికన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఎన్నికల రోజు వరకూ ఈ మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదు. విస్కాన్సిన్‌లో ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు అంశంపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో దాఖలైన వేర్వేరు కేసులన్నీ చివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తాయి.

2000లో రిపబ్లికన్‌ అభ్యర్థి జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ ఫ్లోరిడాలో డెమొక్రటిక్‌ అభ్యర్థి అల్‌గోర్‌పై గెలిచింది ఇలాంటి కోర్టు కేసు సాయంతోనే. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ట్రంప్‌ అమీ కోనీ బారెట్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. బారెట్‌ నియామకం కూడా 6– 3 ఆధిక్యంతో జరగడం ట్రంప్‌కు అనుకూలించే అంశమని నిపుణుల అంచనా. చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలన్నదే తమ అభిమతమని, అందుకే ఓటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు.  

ఎలక్టోరల్‌ కాలేజీ ద్వారా...
అమెరికా రాజ్యాంగం ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో కనీసం 270 సాధించిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌ 14న ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు సమావేశమై అధ్యక్షుడి కోసం ఓట్లు వేయనున్నారు. హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్, సెనేట్‌లు రెండూ జనవరి 6న సమావేశమై ఈ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఫలితాలను నిర్ధారించి ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌కు అందిస్తూంటారు.

అయితే ఎన్నికలు పోటాపోటీగా జరిగిన రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీలు రెండు వేర్వేరు ఫలితాలను ఇస్తే ఏమవుతుందన్నది ఇటీవలి కాలంలో విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్‌ కరోలినాల్లో గవర్నర్లు డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన వారు. అసెంబ్లీలన్నీ రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఎవరి మాటకు విలువ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పలువురు చెబుతున్నప్పటికీ, 2000, 1876లలో ఇదే రకమైన వివాదాలు ఏర్పడిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.  ఇప్పటికైతే సెనేట్‌ రిపబ్లికన్ల చేతుల్లో ఉండగా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యత కొనసాగుతోంది.

అయితే జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసే కొత్త కాంగ్రెస్‌ ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లను లెక్కించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు సభలు ఫలితాల విషయంలో అంగీకారానికి రాలేకపోతే ఏమవుతుందన్నది ఓ శేష ప్రశ్న. చట్ట ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గం ఆమోదించిన ఎలక్టర్ల మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అంశం న్యాయస్థానాల పరీక్షకు గురికాని నేపథ్యంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్ల లెక్కింపు నిలిచిపోతే అప్పుడు కూడా విజయానికి 270 ఓట్లు కావాలా? లేక లెక్కించిన ఓట్లలో ఆధిక్యత వస్తే సరిపోతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు.

కంటింజెంట్‌ ఎన్నికలు...
ఎలక్టోరల్‌ ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికీ తగిన మెజార్టీ రాకపోతే అది కాస్తా అమెరికన్‌ రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కంటింజెంట్‌ ఎన్నికలకు దారితీస్తుంది. ఇందులో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనేట్‌ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఈ కంటింజెంట్‌ ఎన్నికల్లో హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లోని ప్రతి రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు లభిస్తుంది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో ఇరవై ఆరు రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. డెమోక్రాట్లకు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో ఇరువురికీ సమానమైన ప్రాభవం ఉంది. ఇంకో రాష్ట్రంలో ఏడుగురు డెమోక్రాట్లు, ఆరుగురు రిపబ్లికన్లు, ఒక లిబరటేరియన్‌ ఉన్నారు. ఎలక్టోరల్‌ ఓట్లు ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు 269 చొప్పున వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటింజెంట్‌ ఎన్నికలు జరుగుతాయి.
 
     అయితే ఏ వివాదమైనా జనవరి 20లోపు ముగియాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ రోజుతో అధ్యక్షుడి పదవీ కాలం ముగుస్తుంది. ఒకవేళ ఆ రోజుకు కూడా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోతే స్పీకర్‌ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్పీకర్‌గా ఉన్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top