ఈవీదే ఠీవీ! | - | Sakshi
Sakshi News home page

ఈవీదే ఠీవీ!

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

ప్రోత్సాహంగా పన్ను మినహాయింపు..

నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్‌ వాహనాలు

సాక్షి, సిటీబ్యూరో

కొద్ది రోజులుగా ఇంధన పొదుపు మంత్రాన్ని వల్లెవేసిన కేంద్రం ఊహించినట్లుగానే పెట్రో బాంబు పేల్చింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలు మొదలుకొని అందరిపైనా పెట్రోల్‌, డీజిల్‌ భారం మోపింది. ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం తలెత్తినా ఇంధనం ధరలకు రెక్కలొచ్చేస్తాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ధరలు పెంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎలక్ట్రిక్‌ వాహనాలు ఈ ధరాఘాతం నుంచి సామాన్యులకు ఊరటనిస్తున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొంతకాలంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. నగరంలో ప్రస్తుతం 81,812 ఎలక్ట్రిక్‌ వాహనాలు నమోదయ్యాయి. ఈ వాహనాల వినియోగంతో రోజుకు సుమారు 1.82 లక్షల లీటర్ల చొప్పున ప్రతి నెలా సుమారు 54.86 లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతున్నట్లు అంచనా. తద్వారా సుమారు రూ. 56.53 కోట్లు ఆదాయం మిగులుతుంది. అస్థిరమైన పెట్రోల్‌, డీజిల్‌,సీఎన్జీ, ఎల్పీజీ, తదితర ఇంధన ధరలను దృష్ట్యా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఒక పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో సమగ్రమైన ప్రజా రవాణా వ్యవస్థ మాత్రమే శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని రవాణా రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలక్ట్రిక్‌ వాహనాలపై రవాణాశాఖ జీవితకాల పన్నును మినహాయించింది.ఇది విద్యుత్‌ వాహనాలకు ఎంతో ప్రోత్సాహంగా మారింది. 2024 నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల విద్యుత్‌ వాహనాలపైన రూ.810 కోట్ల వరకు ఈ మినహాయింపు లభించినట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ సి.రమేష్‌ తెలిపారు.ఆర్టీఏలో నమోదైన 81812 వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 56,465 ఉన్నాయి. వీటిపైన రూ.67.14 కోట్లు, సుమారు 22049 కార్లపైన రూ.741.19 కోట్ల చొప్పున పన్ను మినహాయింపు లభించింది. అలాగే 2608 ఆటోరిక్షాలు, 372 సరుకు రవాణా వాహనాలు, మరో 318 బస్సులకు కూడా జీవిత కాల పన్ను నుంచి ఊరట కల్పించినట్లు జేటీసీ చెప్పారు.హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు పన్ను మినహాయింపును కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ విద్యుత్‌ వాహనాల వినియోగం వల్ల ప్రతి నెలా 1.31 లక్షల టన్నులకు పైగా కాలుష్య కారకాలు తగ్గుముఖం పట్టినట్లు అంచనా.

ప్రతి నెలా రూ.56 కోట్లకు పైగా ఆదా

రోజుకు 1.83 లక్షల లీటర్ల ఇంధనం పొదుపు

ప్రజా రవాణా సదుపాయంతో మరింత తగ్గనున్న ఖర్చులు

వాహన రకం సంఖ్య నెల ఇంధన ఆదా

(రూ.కోట్లలో)

ద్విచక్ర వాహనాలు 56,465 26.68

కార్లు 22,049 22.23

ఆటోలు 2,608 2.88

గూడ్స్‌ వాహనాలు 372 1.23

బస్సులు 318 3.51

మొత్తం వాహనాలు 81,812 56.53

విద్యుత్‌ వాహనాలతో ఆదా ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement