నేపాలీలను నివారించండి | - | Sakshi
Sakshi News home page

నేపాలీలను నివారించండి

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్న పోలీసులు

ఇతర పనివారి వివరాలూ ధ్రువీకరించుకోండి

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌

రాజధాని వ్యాప్తంగా ఇటీవలి నేరాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీలున్నంత వరకు నేపాలీలను పనిలో పెట్టుకోవడాన్ని నిలువరించాలని సూచిస్తున్నారు. ఇతర పనివాళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలంటూ నగరవ్యాప్తంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మాజీ ఐపీఎస్‌ వినయ్‌ రంజన్‌ రే భార్య తనూజ దారుణ హత్య, దోపిడీ ఘటన జరిగిన వారం రోజుల్లోనే జవహర్‌నగర్‌ కౌకూర్‌లో నేపాలీలు మరో దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో నేపాలీల నేరాలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తులో పోలీసులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు.

అత్యంత జాగ్రత్తగా ఉండాలి..

ఇక ఇతర పనివారి రికార్డులూ లేకపోవడంతో జరగరానిది జరిగినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న పోలీసులు ఠాణాల వారీగా క్షేత్రస్థాయిలో నేపాలీలు, ఇతర పనివారి వివరాలు సేకరించడంతో పాటు నేపాలీలను నివారించాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. వాటిలో... కొందరు నేరచరితులు డ్రైవర్లు, కార్మికులు, కేర్‌టేకర్లుగా చేరి యజమానుల విశ్వాసం పొందుతున్నారు. ఆపై అదును చూసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాళ్లలో నేపాలీలు ఎక్కువ ఉంటున్నారు. ఈ దృష్ట్యా పనిలో పెట్టుకునే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని, పనివాళ్ల వివరాలను పోలీసులకు అందించి పూర్వాపరాల పరిశీలన, ధ్రువీకరణ చేసుకోవాలని, వీటిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేస్తున్నారు. వీలున్నంత వరకు నేపాలీ గృహ కార్మికులను నియమించుకోవడాన్ని నివారించాలని, ఒకవేళ నియమించుకుంటే పూర్తి నాగరిక్‌/గుర్తింపు వివరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్‌, ఫొటోగ్రాఫ్‌, మొబైల్‌ నంబర్‌, శాశ్వత చిరునామాను ధ్రువీకరించువాలని, ఈ వివరాలన్నీ రికార్డుల నిర్వహణ కోసం స్థానిక స్టేషన్‌లో అందించాలని పోలీసులు కోరుతున్నారు. దీంతోపాటు నేరాల నిరోధం, ఆధారాల సేకరణకు సాధ్యమైన చోటల్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. విలువైన వస్తువులు, లాకర్లు, నగదు ఉన్నవాటితో పాటు సున్నిత ప్రాంతాలకు పనివాళ్ల ప్రవేశాన్ని పరిమితం చేయాలని పేర్కొన్నారు. అనుమానాస్పద కార్యకలాపం లేదా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

నేపాల్‌తో సంబంధాలపై ప్రభావం?

హైదరాబాద్‌ పోలీసుల చర్యలు సరిహద్దు దేశమైన నేపాల్‌తో భారత్‌ సంబంధాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దేశంతో స్నేహపూర్వక, వర్తక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నేపాలీల అంశంలో జారీచేసిన నోటీసుల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement