నిమ్స్‌ మరో రికార్డు | - | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ మరో రికార్డు

May 16 2026 11:01 PM | Updated on May 16 2026 11:01 PM

● రోగులకు అవయవాలువిజయవంతంగా అమర్చిన వైద్యులు

24 గంటల్లో 2 లివర్‌.. 3 కిడ్నీ మార్పిడి సర్జరీలు

లక్డీకాపూల్‌: నిమ్స్‌ వైద్యులు 24 గంటల వ్యవధిలో 2 కాలేయ (లివర్‌), 3 మూత్రపిండ (కిడ్నీ) మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి అరుదైన ఘనతను సాధించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు ఈ ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించారు. శుక్రవారం నిమ్స్‌ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం.. అత్యంత క్లిష్టమైన వైద్య పరిస్థితులలో ఈ నెల 9, 10 తేదీల్లో 24 గంటల వ్యవధిలో వరుసగా రెండు అత్యవసర మృతదాత కాలేయ మార్పిడులను విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ, రీనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విభాగం కేవలం 9 గంటల వ్యవధిలో 3 మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసింది. మూడు ప్రత్యేక శస్త్రచికిత్స బృందాలుగా విభజించి ఈ శస్త్రచికిత్సలను ఏకకాలంలో నిర్వహించగా, అదే విభాగం స్వతంత్రంగా అవయవ సేకరణ ప్రక్రియలను కూడా చేపట్టింది. ఇంత తక్కువ సమయంలో రోగి సేవలకు అంతరాయం కలగకుండా, ఈ స్థాయిలో బహుళ మృతదేహ మార్పిడులను నిర్వహించడం మొదటి ఘనతగా నిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులలో ఈ ప్రక్రియల ఖర్చు సుమారు రూ.45 లక్షలకు పైగా ఉంటుంది. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పొందారు.

● బ్రెయిన్‌ డెడ్‌ అయిన 59 ఏళ్ల మహిళ కుటుంబం మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాల దానానికి అంగీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన 22 ఏళ్ల యువకుడి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించారు. మరో ఘటనలో రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన పదేళ్ల బాలుడి అవయవాలను కూడా సేకరించారు.

● కాలేయ నిల్వ అత్యంత క్షీణించి, డీకంపెన్సేటెడ్‌ క్రానిక్‌ లివర్‌ డిసీజ్‌ (డీసీఎల్‌డీ)తో బాధపడుతున్న 17 ఏళ్ల యువకుడికి మొదటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. క్రమంగా కోలుకుంటున్నారు. అదే వైద్యబృందం ఆల్కహాలిక్‌ డీసీఎల్‌డీ ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి కాలేయ మార్పిడి చేపట్టింది.

● దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (సీకేడీ), అంత్య దశ మూత్రపిండ వ్యాధి (ఈఎస్‌ఆర్‌డీ)తో బాధపడుతున్న 19, 31, 59 సంవత్సరాల వయసు రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్సలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement