పెంపుడు జంతువులపై ఎనలేని మమకారం
నగర శివారు మీర్‌పేట్ పరిధి వెంకటాద్రి కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని హిమబిందుకు పెట్స్ అంటే ప్రాణం. బంధువుల నుంచి మూడు పిల్లులను దత్తత తీసుకుని పెంచుకుంటోంది. కుటుంబ సభ్యుల కంటే ఆమెకు మార్జాలంపైనే మక్కువ. అంతలా ప్రేమించే పిల్లి ఇటీవల రోడ్డుపై మృతి చెంది కనిపించింది. షాక్‌కు గురైన హిమబిందు మానసిక ఒత్తిడికి గురైంది. గురువారం బెడ్రూంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది
● వనస్థలిపురానికి చెందిన శాంభవి దేవి మగ పెర్షియన్ పిల్లిని పెంచుకుంటోంది. ఇటీవల అది అనారోగ్యం బారిన పడటంతో పెట్ క్లినిక్‌కు తీసుకెళ్లింది. డాక్టర్ పరీక్షించి మూడుసార్లు సర్జరీలు చేశాడు. అయినా.. పిల్లి ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో శాంభవి కుంగిపోయింది. మళ్లీ డాక్టర్ సంప్రదించగా.. అసభ్యకర పదజాలంతో దూషించాడని చైతన్యపురి ఠాణాలో ఆమె ఫిర్యాదు చేసింది.
ఇలా.. పిల్లులు, శునకాలు, కుందేళ్లు, పావురాలు, చిలుకలు.. కావేవీ అనుబంధాలకు అనర్హం అన్నట్టుగా మారింది నగరంలోని ప్రస్తుతం పెట్ లవర్స్ పరిస్థితి. మానవ సంబంధాల కంటే పెంపుడు జంతువుల పైనే మమకారం పెంచుకుంటున్నారు. జంతువుల మీద ప్రేమలు, ఆప్యాయతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రేమగా పెంచుకునే పెట్స్ అనారోగ్యానికి గురైనా హైరానా పడిపోతున్నారు. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలకు గురవుతున్నారు. ఇక, అల్లారుముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులు మరణిస్తే.. తట్టుకోలేక ఏకంగా ఆత్మహత్య చేసుకునే స్థాయికి బంధాలు చేరాయి.
– సాక్షి, సిటీబ్యూరో
బంధాల కోసం వెతుకులాట..
మానవ సంబంధాలు దారి మళ్లుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, ప్రైవసీ.. కారణాలమైనా మహా నగరంలో అనుబంధాలు మృగ్యమవుతున్నాయి. ఆప్యాయంగా పలకరించే వాళ్లే కరువైపోయారు. దీంతో అనుబంధాలను ఎతుక్కునే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులతోనే మమకారం పెనవేసుకుంటోంది. ఇంట్లో మాట్లాడేవాళ్లే లేకపోవడంతో పెట్స్‌తోనే జీవితం గడిపే పరిస్థితి ఏర్పడింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న అరుదైన ఆఫ్రికన్ గ్రే చిలుక తప్పిపోవడంతో హైరానా పడిపోయిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫైర్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు.. మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి తప్పిపోయిన చిలుకను క్షేమంగా యజమానికి అప్పగించిన సంఘటన ఇటీవల బంజారాహిల్స్‌లో జరిగింది.
మానసిక ఒత్తిడి దూరం..
మానసిక అలసట, దుఃఖం లేదా ఒంటరితనంతో ఉండే వ్యక్తులు జంతువులతో ఎక్కువగా మమేకమవుతున్నారు. మానసిక స్థితిని నియంత్రించుకోవడానికి, బంధాలపై నమ్మకాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి పెంపుడు జంతువులు సహాయపడతాయని పలు అధ్యయనాల్లోనూ తేలింది. పెట్స్ ఓ స్టేటస్ సింబల్ మారంది. స్థానిక జాతులు కాకుండా ప్రపంచ దేశాల నుంచి అరుదైన జంతువులను తీసుకొచ్చి పెంచుకోవడం కొత్త ఫ్యాషన్‌గా మారింది ఇంటిలో వాటి కోసం ప్రత్యేకంగా గదులు, ఆడుకునేందుకు వార్డ్‌రోబ్‌లు, ప్రత్యేకంగా పెట్ పార్క్‌లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇగ్వానాలు, షుగర్ గ్లైడర్లు, బర్మీస్ కొండచిలువ, బాల్ పైథాన్‌లు, నక్షత్ర తాబేలు వంటి జంతువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ప్రేమాప్యాయతలు కనబరుస్తున్న పెట్ లవర్స్
వీటికి అనారోగ్యం వస్తే తట్టుకోలేని వైనం
పెంపుడు పిల్లి మృతిని తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
తాజాగా నగర శివారు మీర్‌పేట్‌లో విషాద ఘటన
కుక్క ఆరోగ్యం మెరుగవ్వలేదని వైద్యుడిపై ఇటీవల కేసు
గ్రేటర్ పరిధిలో చోటుచేసుకుంటున్న పలు ఉదంతాలు


