ఊహల పల్లకిలో.. | - | Sakshi
Sakshi News home page

ఊహల పల్లకిలో..

Mar 20 2026 9:22 AM | Updated on Mar 20 2026 9:22 AM

రాష్ట్ర బడ్జెట్‌పై జలమండలి భారీ ఆశలు

క్యూర్‌ వాటర్‌, సీవరేజీ మాస్టర్‌ ప్లాన్‌

కేటాయింపులు సరే.. నిధుల విడుదల అంతంతే

ఇస్తారా రూ.6,500 కోట్లు!

మురిపించేనా.. ఉసూరుమనిపించేనా?

రాష్ట్ర ప్రభుత్వం కరుణిస్తేనే మూడు కార్పొరేషన్ల మనుగడ

సాక్షి, సిటీబ్యూరో: మహానగర దాహార్తిని తీర్చే హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజీ బోర్డు (జలమండలి) రాష్ట్ర బడ్జెట్‌– 2026–2027పై ఆశలు పెట్టుకుంది. జలమండలి పరిధి కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌ )వరకు విస్తరించడంతో బాధ్యతలు రెట్టింపయ్యాయి. దీంతో ఈసారి అవసరమైన నిధుల కోసం బడ్జెట్‌లో ప్రధానంగా నాలుగైదు అంశాలపై దృష్టి సారించి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్యూర్‌ వాటర్‌, సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్లు, గోదావరి ఫేజ్‌–2, 3, సుంకిశాల ఇన్‌టెక్‌ వెల్‌, ఎస్టీపీల నిర్మాణ పనులకు నిధులు అవశ్యమని భావిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జలమండలి రూ.6,500 కోట్ల వరకు కావాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం పెరిగిన అవసరాల దృష్ట్యా ఈసారి రూ.5వేల కోట్ల వరకు నిధులు కేటాయింపు ఉండవచ్చని జలమండలి భావిస్తోంది.

సీవరేజ్‌ పనులకు ‘బూస్ట్‌‘ లభించేనా?

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవ పథకానికి అనుబంధంగా సీవరేజ్‌ పనులకు ఈ బడ్జెట్‌లో ‘బూస్ట్‌‘ లభించే అవకాశం ఉనట్లు తెలుస్తోంది, నగరం చుట్టూ మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మూసీ ప్రక్షాళనకు ఊతమివ్వచ్చని జలమండలి ఆశిస్తోంది. గత మూడేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు భారీగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో నిధుల విడుదల ఆశించిన స్థాయిలో లేకుండాపోయింది. గతంలో కేటాయించిన నిధుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం వరకే సకాలంలో విడుదలవుతున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లు భారీ ఆశలే పెట్టుకున్నాయి. క్యూర్‌ పరిధిలోని 27 స్థానిక సంస్థల్నీ దృష్టిలో ఉంచుకొని గత జనవరి 31 జరిగిన పాలకమండలి సమావేశంలో రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ నిధులు ఇస్తారనే నమ్మకంతోనే ఆమోదం తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల అంచనాతోనే ఆ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. పాత జీహెచ్‌ఎంసీ పరిధి వరకు రూ.9,200 కోట్లు, విలీనమైన 27 స్థానిక సంస్థల పరిధిలో పనులకు రూ.2,260 కోట్లతో, మొత్తం రూ.11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. హెచ్‌– సిటీ ప్రాజెక్ట్‌ కింద పలు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు తదితర నిర్మాణాల కోసం, రూ.7,032 కోట్లు.. 7.60 లక్షల వీధిదీపాలకు రూ.1,341.60 కోట్లు, సీఆర్‌ఎంపీ కింద 1045 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్వహణకు రూ.3,145 కోట్ల పనులకు ప్రభుత్వం పాలనపరమైన ఆమోదం తెలిపినప్పటికీ నిధులు కావాల్సి ఉంది. ఇవి దీర్ఘకాలిక పనులు కావడంతో ఏడాది కాలానికై నా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.3,100 కోట్లు అందవచ్చనే ఆశతోనే బడ్జెట్‌ను ఆమోదించారు.

మారిన నగర ముఖ చిత్రం..

మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కాకముందే, విలీనమైన 27 స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ఒకే కార్పొరేషన్‌గా ఆ బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రస్తుతం మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటైనందున మౌలిక సదుపాయాలకు మరిన్ని నిధులవసరం. రెండు కొత్త కార్పొరేషన్లు తమకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను రూపొందించుకోవాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధి మారినందున దాని బడ్జెట్‌నూ సవరించాల్సి ఉంటుంది మూడు కార్పొరేషన్లుగా రూపాంతరం చెందకముందు రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.400 కోట్లు గ్రాంట్స్‌, క్యాపిటల్‌ గ్రాంట్స్‌గా రూ.3,100 కోట్లు ఇవ్వగలదని భావించారు. కానీ కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో నగర ముఖచిత్రమే మారినందున మరిన్ని నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందన్నది చూడాలి. బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించనిదే జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు మనుగడ సాగించలేని పరిస్థితి.

గత మూడేళ్లలో ఇలా..

ఆర్థిక సంవత్సరం ప్రతిపాదన బడ్జెట్‌ కేటాయింపు

(రూ. కోట్లలో)

2025-2026 5,500 3,385

2024-2025 5,650 3,385

2023-2024 5,937 1,960

Advertisement
 
Advertisement
Advertisement