అక్రమ సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమ సిలిండర్‌

Mar 20 2026 9:22 AM | Updated on Mar 20 2026 9:22 AM

1,073కు పైగా సిలిండర్లు సీజ్‌

ఒక వినియోగదారుకు ఒకటే కనెక్షన్‌

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

రంగంలోకి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌

గ్రేటర్‌లో ‘ఎల్పీజీ’పై మెరుపు దాడులు

సాక్షి, సిటీబ్యూరో: నగర పరిధిలో గ్యాస్‌ సిలిండర్ల అక్రమ చలామణిపై పౌరసరఫరాల శాఖ సీరియస్‌గా దృష్టి పెట్టింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా తనిఖీలు ముమ్మరం చేసింది. గృహావసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న ముఠాల గుట్టు రట్టు చేస్తోంది. మరోవైపు హోటళ్లలో సరైన పత్రాలు లేని అక్రమ ఖాళీ వాణిజ్య సిలిండర్లపై సైతం కొరడా ఝుళిపిస్తోంది. శ్రీనగర్‌ కాలనీ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్‌, జియాగూడ, అబిడ్స్‌, నార్సింగి, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, బాలానగర్‌, షాపూర్‌నగర్‌, సూరారం, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో గ్యాస్‌ ఏజెన్సీలు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లపై దాడులు జరిపి సుమారు 1,073కుపైగా సిలిండర్లను సీజ్‌ చేసింది. ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ కింద 308కి పైగా కేసులు నమోదు చేసింది. రీఫిల్లింగ్‌ చేస్తున్న కమర్శియల్‌, చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకుంది.

నిబంధనలు కఠినతరం..

గ్యాస్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు నిబంధనలను కఠినతరం చేశారు. ఒక వినియోగదారుడికిఒకే కనెక్షన్‌్‌ మాత్రమే ఉండాలి. ఒకే పేరు మీద వేర్వేరు కంపెనీల కనెక్షన్లు ఉండటం నిబంధనలకు విరుద్ధం. అలాంటి కనెక్షన్లను తక్షణమే గుర్తించి బ్లాక్‌ చేస్తున్నారు. మరోవైపు పైపులైన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారు పాత ఎల్పీజీ కనెక్షన్‌ను వెంటనే సరెండర్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే (పైప్‌డ్‌ గ్యాస్‌) వాడుతున్న వారు సుమారు 20 వేలకు పైగా తమ పాత కనెక్షన్లను సరెండర్‌ చేయలేదని గుర్తించారు.

అక్రమ ఖాళీ సిలిండర్లున్నా సీజ్‌

హోటళ్లు, హాస్టళ్లలో గృహ వినియోగ సిలిండర్ల వినియోగం చట్టరీత్యా నేరం. తనిఖీ సమయంలో ఇతర కంపెనీలకు చెందిన ఖాళీ సిలిండర్లు కనిపించినా, వాటికి సరైన ఆధారాలు చూపకపోతే అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. హోటల్‌ కిచెన్లలో కమర్షియల్‌ సిలిండర్లు మాత్రమే ఉండాలని, డొమెస్టిక్‌ సిలిండర్లు లభ్యమైతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మా పరిస్థితి ఏంటి?

హోటల్‌ యజమానులు

ప్రభుత్వ చర్యలపై హోటల్‌ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కమర్షియల్‌ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని వారు వాపోతున్నారు. ఈ తరుణంలో అధికారులు దాడులు చేస్తూ సిలిండర్లను సీజ్‌ చేయడం వల్ల వ్యాపారాలు మూతపడే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌ మార్కెట్లో సిలిండర్ల దందాను అరికట్టేందుకు, సామాన్య గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

గ్రేటర్‌ పరిధిలో దాడులు ఇలా..

జిల్లా సిలిండర్ల కేసులు

సీజ్‌

హైదరాబాద్‌ 643 233

రంగారెడ్డి 250 45

మేడ్చల్‌–మల్కాజిగిరి 180 30

Advertisement
 
Advertisement
Advertisement