డీపీతో టోపీ! | - | Sakshi
Sakshi News home page

డీపీతో టోపీ!

Mar 20 2026 9:16 AM | Updated on Mar 20 2026 9:16 AM

నగర వ్యాపారి ఫొటో వాట్సాప్‌ డీపీగా వినియోగం

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ మహిళా వ్యాపారి ఫొటోను వాట్సాప్‌ డిస్‌ప్లే పిక్చర్‌గా (డీపీ) ఏర్పాటు చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు ఆమె అకౌంటెంట్‌కు టోకరా వేశారు. ఆమె పంపినట్లుగా సందేశం పంపి రూ.1.2 కోట్లు కాజేశారు. మరో రూ.18 లక్షలు స్వాహా చేయడానికి ప్రయత్నించగా... విషయం సదరు వ్యాపారికి తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బంజారాహిల్స్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సదరు సంస్థకు దేశ వ్యాప్తంగా క్‌లైంట్స్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి వీరి ఖాతా నుంచి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. యజమానురాలి నుంచి వచ్చే మౌఖిక ఆదేశాలు, సందేశాల ఆధారంగా అక్కడ అకౌంటెంట్‌ ఈ లావాదేవీలు చేస్తూ ఉంటారు. దీన్నే సైబర్‌ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకున్నారు. ఇంటర్‌నెట్‌ ద్వారా ఈ సంస్థ యజమానురాలితో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను సంగ్రహించారు. నెట్‌ నుంచే సంగ్రహించిన యజమానురాలి ఫొటోను తమ వాట్సాప్‌ నెంబర్‌కు డీపీగా పెట్టారు. ఈ నెంబర్‌ నుంచి ఈ ఈ నెల 13 మధ్యాహ్నం 3.30 గంటలకు అకౌంటెంట్‌కు ఓ సందేశం పంపారు. అందులో పొందుపరిచిన బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేయమంటూ ఆ సందేశంలో ఉంది. తమకు సందేశం వచ్చింది కొత్త నెంబర్‌ నుంచే అయినప్పటికీ... డీపీగా యజమానురాలి ఫొటోనే ఉండటంతో అకౌంటెంట్‌ నమ్మాడు. అది తన యజమానురాలికి చెందిన మరో నెంబర్‌గా భావించాడు. తరచు ఆమె నుంచి ఇలాంటి సందేశాలు రావడం, నగదు బదిలీలు జరగడం మామూలే కావడంతో ఆ సందేశంలో ఉన్న ఢిల్లీకి చెందిన సంస్థ బ్యాంకు ఖాతాకు రూ.1.2 కోట్లు బదిలీ చేశాడు. ఆ రోజు తన యజమానురాలు హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ వివరాలను తన రికార్డుల్లో పొందుపరిచినా.. ప్రత్యేకించి ఆమె దృష్టికి తీసుకువెళ్లలేదు. ఒకసారి తమ పథకం పారడంతో సైబర్‌ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈ సంస్థ నుంచి మరికొంత దోచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా మంగళవారం అదే వాట్సాప్‌ నెంబర్‌ నుంచి అకౌంటెంట్‌కు మరో సందేశం పంపారు. ఈసారి తమిళనాడులో ఉన్న ఓ ప్రైవేట్‌ కంపెనీ ఖాతాకు రూ.18 లక్షలు బదిలీ చేయాలని అందులో పొందుపరిచారు. తన యజమానురాలి ఫొటో డీపీగా ఉన్న కొత్త వాట్సాప్‌ నెంబర్‌ నుంచి మరో సందేశం రావడం, అందులో మరో రాష్ట్రంలోని బ్యాంకు ఖాతా వివరాలు ఉండటంతో అకౌంటెంట్‌ అనుమానించాడు. అందుబాటులో ఉన్న యజమానురాలి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. దీంతో జరిగిన విషయం గుర్తించిన ఆమె నగర సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్‌లోని 66సీ, 66 డీ, భారతీయ న్యాయ సంహితలోని (బీఎన్‌ఎస్‌) 318 (4), 319(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి వాళ్లు వినియోగించిన సెల్‌ఫోన్‌ నెంబర్‌తో పాటు నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతా వివరాలను విశ్లేషిస్తున్నారు.

ఆ నెంబర్‌ వినియోగించి ఆమె అకౌంటెంట్‌కు సందేశం

ఢిల్లీకి చెందిన బ్యాంక్‌ ఖాతాలోకి నగదు బదిలీకి ఆదేశం

రూ.1.2 కోట్లు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు, కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement