సంప్రదాయాలతోనే సమతుల్యత | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలతోనే సమతుల్యత

Mar 20 2026 9:16 AM | Updated on Mar 20 2026 9:16 AM

మణికొండ: ప్రకృతి, పండగలు, సంప్రదాయాలు ఆచరించినపుడే జీవితంలో సమతుల్యత సాధ్యమని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. గురువారం ఉగాది పండగను పురస్కరించుకుని కోకాపేట నియోపోలీస్‌లోని పీఠంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. ఉదయం 9గంటల నుంచి శ్రీశారదా చంద్రమౌళీశ్వర ఆరాధన, సంగీత విహారి, పంచాంగ ఆవిష్కరణ, పంచాంగ శ్రవణం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే విశాఖలో ఉన్న పీఠం మాదిరిగానే కోకాపేటలోను ఏర్పాటు చేయాలని నిర్ణయించి పనులను కొనసాగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలు సుబిక్షంగా ఉండి, అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం రెండు రాష్ట్రాల ప్రజలకు సంపూర్ణంగా ఉంటుందన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. పంచాంగం, నక్షత్రాలు, గ్రహణాలు వంటి అంశాలు మూఢనమ్మకాలు కావని, వాటిపై మన రుషులు పరిశోధనలు చేసి వాటిని మనకు అందించారన్నారు. వాటి ఆదారంగానే సముద్రపు అలల మార్పు, జంతువుల ప్రవర్తన, చెట్లు చిగురించటం లాంటివి సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయన్నారు. ఈ సంవత్సరం గురువు అధిపతి కాబట్టి అంతా బాగుంటుందని, ప్రతి రోజు ఉదయం సూర్యారాధన చేసే వారికి మరింతగా బాగుంటుందన్నారు. జూలై నెల నుంచి ఇక్కడే ఉండి పీఠం రాజశ్యామల అమ్మవారి దేవాలయ నిర్మాణ పనులను చూసుకుంటానన్నారు. కార్యక్రమంలో పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ రామకృష్ణారెడ్డి, పట్నా హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌రావు, ఎన్‌సీఎల్‌టీ న్యాయ సభ్యుడు జస్టిస్‌ బద్రీనాథ్‌, మాజీ న్యాయమూర్తి మఠం వెంకటరమణ, హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మురళీధర్‌రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, డీఆర్‌డీఏ మాజీ చైర్మెన్‌ సతీష్‌రెడ్డి, మాజీ డీజీపీ అంజనీకుమార్‌, గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌లతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

విశాఖ శ్రీశారదా పీఠాధిపతిస్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి

Advertisement
 
Advertisement
Advertisement