జీడబ్ల్యూఎంసీలో పీఎఫ్ ఖాతాలపై ప్రైవేట్ పెత్తనం తాజాగా 40 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు వెలుగులోకి
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో పీఎఫ్ ఖాతాలపై ప్రైవేట్ పెత్తనం మితీమీరిందన్న ఆరోపణలు రెట్టింపవుతున్నాయి. 2019, 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి 14 నెలల బకాయిలు తమ ఖాతాల్లో జమ చేయించాలని ఏడుగురు ఉద్యోగులు తాజాగా కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. మరోవైపు సుమారు 40 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో పేర్లు, వ్యక్తిగత వివరాల్లో తప్పులు సరిచేయకపోవడంతో ఆరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నపాటి అక్షర దోషాలు, ఆధార్, పీఎఫ్ రికార్డుల్లో వివరాల వ్యత్యాసాలు సరిచేయించుకోవడానికి పదేపదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్య కేవలం కంప్యూటర్ ఆపరేటర్లకే పరిమితం కాలేదు. డీఆర్‌ఎఫ్, పబ్లిక్ హెల్త్, జవాన్లు, డ్రైవర్లు, ఫిల్టర్ బెడ్ ఆపరేటర్లు తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా పీఎఫ్ వివరాల సవరణల కోసం ఇబ్బందులు పడుతుండడంతో ఆ ప్రైవేట్ వ్యక్తి పనితీరుపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. పీఎఫ్ ఖాతాల్లో పేర్లు, ఇతర వివరాల సవరణల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. డబ్బులు ఇచ్చినా పనులు పూర్తికావడం లేదని, గట్టిగా ప్రశ్నించిన వారికి తాము ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకెళ్లాలని చెబుతూ బెదిరిస్తుండడంతో సదరు వ్యక్తి వెనకాల అకౌంట్స్ విభాగంలోని కీలక అధికారులే ఉండొచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హే రాం అంటూనే డబ్బులు ప్రసాదంలాగా ఇవ్వాల్సి వస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.
అధికారులు మారినా..
జీడబ్ల్యూఎంసీలో ఇప్పటికే ఐదుగురు అదనపు కమిషనర్లు, నలుగురు కమిషనర్లు మారినా పీఎఫ్ సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయి కలెక్టర్లు సైతం బాధిత ఉద్యోగులను పలుమార్లు చూసి ‘ఇంకా మీ పని కాలేదా?’ అని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇంతమంది ఉన్నతాధికారులు మారినా ఒకే సమస్య ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటానికి కారణాలేమిటి? ఫైళ్లు ఎక్కడ నిలిచిపోయాయి? బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది.
కలెక్టర్, కమిషనర్ ప్రత్యేక విచారణ చేపట్టాలి..
పీఎఫ్ వ్యవహారాలపై వస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. గత ఆరేళ్ల పీఎఫ్ రికార్డులను పరిశీలించి, ఉద్యోగుల వారీగా ఖాతాల వివరాలు, జమలు, బకాయిలు, పెండింగ్ సవరణలపై ప్రత్యేక నివేదిక రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. సదరు ప్రైవేట్ వ్యక్తికి అప్పగించిన బాధ్యతలు, అధికార పరిధి, ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేపట్టాలి. అక్రమ వసూళ్లు జరిగినట్లు ఆధారాలతో తేలితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే, 40 మంది ఉద్యోగుల పీఎఫ్ వివరాల సవరణలను గడువులోగా పూర్తి చేయాలి. గతంలో వెలుగులోకి వచ్చిన బకాయిలు, ఇతర ఉద్యోగుల ప్రయోజనాల సమస్యలను కూడా పరిష్కరించాలి. కార్మికుల భవిష్యత్‌తో ముడిపడిన ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు మౌనం వీడి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే 14 నెలల బకాయిల విషయం తెరపైకి
అకౌంట్లలో పేర్లు, వ్యక్తిగత వివరాలు సరిద్దేందుకు కాలయాపన


