హసన్‌పర్తి: పొగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు సీఈఐర్ పోర్టల్‌తో గుర్తించారు. ఈమేరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌లను బుధవారం పోలీస్ కమిషనర్ శ్వేత బాధితులకు అందించారు. సీసీఎస్ ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ బృందం ప్రత్యేక చొరవతో ఫోన్ల రికవరీకి కృషి చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, కానిస్టేబుల్ రాములు, జితేందర్‌ను సీపీ అభినందించారు.
హన్మకొండ అర్బన్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సువర్ణ బుధవారం హనుమకొండ, వరంగల్ జిల్లాలో పర్యటించారు. కంటి పరీక్షలు, కంటి శస్త్రచికిత్సలు, నేత్రదాన కార్యక్రమాల అమలును పరిశీలించారు. హనుమకొండలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలు, దృష్టి లోపాల గుర్తింపు, కళ్లద్దాల పంపిణీపై సమీక్షించారు. సుబేదారిలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ మదన్ మోహన్‌రావుతో సమావేశమయ్యారు. వరంగల్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాంతీయ కంటి ఆస్పత్రిని సందర్శించారు. కంటి పరీక్షలపై శ్రద్ధవహించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షల్లో ఆప్తాల్మిక్ అధికారి ప్రతాపగిరి ప్రసాద్, డాక్టర్ రామ్‌భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: ట్రెయినీ డీఎస్పీలు హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ట్రెయినీ డీఎస్పీలు శాంతన్ కుమార్‌రెడ్డి, సాయి ప్రత్యూష్ రెడ్డి, సబిత, ఆంజనేయులు, యశస్విని ఉన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మోటివ్ పవర్ ఇంజనీర్ (సీఎంపీఈ) ధర్మేందర్ కుమార్ తనిఖీ చేశారు. సీఎంపీఈ కాజీపేట జంక్షన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంప్, 1, 2వ నంబర్ ప్లా ట్‌ఫాంలు, వెయింటింగ్ హాల్స్, స్టేషన్ బయట నిర్మాణంలో ఉన్న కాజీపేట జంక్షన్ అమృత్ భారత్ స్టేషన్ ఆధునికీకరణ పనులు తనిఖీ చేసి స్థానిక అధికారులతో పలు అభివృద్ధి విషయాలపై మాట్లాడారు. సీఎంపీఈ తనిఖీలో కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే ఛీప్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌గోపాల్, హెల్త్ ఇన్‌స్పెక్టర్ బబ్లురాం మీనా, డీజిల్‌షెడ్ ఏఎంఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
ఖిలా వరంగల్: ఎంబీబీఎస్ వైద్య అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న ఐదుగురిపై టీజీఎంసీ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో రాములు క్లినిక్, బాబురావు ఫస్ట్ ఎయిడ్ సెంటర్, శ్వేత ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌తోపాటు మరో ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో తనిఖీలు చేపట్టారు. ఐదుగురు ఎంబీబీఎస్ అర్హతలు లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. వీరిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్యకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం రాత్రి మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో నకిలీ వైద్యులు ఎ.రాములు, జి.బాబురావు, బండి రమేశ్, టి.రాజమౌళి, ఎస్.కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు. అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తిస్తే 91543 82727 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్య కుమార్ తెలిపారు.


