సాక్షి, వరంగల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక, వయోపరిమితి సమస్యలపై ‘సాక్షి’లో ప్రచురితమైన ‘బీమాకు సాంకేతిక చిక్కులు’ కథనానికి వరంగల్ జిల్లా యంత్రాంగం స్పందించింది. అర్హులైన కుటుంబాలు బీమా పథకం ప్రయోజనాన్ని కోల్పోకుండా చర్యలు తీసుకుంటామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. బీమా పొందే వ్యక్తికి మాత్రమే 18 నుంచి 59 ఏళ్లలోపు వయోపరిమితి వర్తిస్తుందని, నామినీ వయస్సుతో సంబంధం లేదని వెల్లడించారు. కుటుంబంలోని ఇతర సభ్యులకు 59 ఏళ్లు దాటినంత మాత్రాన అర్హత కలిగిన సంపాదనపరుడైన వ్యక్తి నమోదు ప్రక్రియకు ఆటంకం ఉండదన్నారు. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే సాంకేతికపరంగా పరిష్కరిస్తామని సాక్షికి ఇచ్చిన వివరణలో ఆమె పేర్కొన్నారు. బీమా పొందే వ్యక్తి తనకు ఇష్టమైన అర్హులైన కుటుంబ సభ్యులను నామినీగా పేర్కొనవచ్చని, నామినీ వయస్సుపై ఎలాంటి పరిమితులు లేవన్నారు. నామినీల పేరు, సంబంధం, ఇతర వివరాలను నమోదు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత నమోదు సిబ్బందిపై ఉందని పేర్కొన్నారు. రేషన్‌కార్డులో ఒక్క సభ్యుడే ఉన్న కుటుంబాలు, భార్యాభర్తల్లో ఒకరు మరణించిన కుటుంబాలకు ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తున్నట్లు కలెక్టర్ వెల్ల డించారు. అలాంటి కుటుంబాల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, తదుపరి ఆదేశాల కోసం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. మైనర్లకు సంబంధించి చట్టబద్ధ సంరక్షకుల వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా పోర్టల్‌లో కల్పించినట్లు పేర్కొన్నారు.
‘ఇందిరమ్మ బీమా’పై కలెక్టర్ వివరణ
‘సాక్షి’ కథనంతో స్పందించిన జిల్లా యంత్రాంగం
బీమా పొందే వ్యక్తికే 18 నుంచి 59 ఏళ్ల
వయోపరిమితి
సింగిల్ మెంబర్ కుటుంబ వివరాలు నమోదు
స్మార్ట్‌ఫోన్ లేకున్నా.. నమోదు,
రశీదు పొందే అవకాశం


