హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో కోటి రూపాయలతో తయారు చేసిన దారుమయ రథాన్ని ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ముందుగా కలశానికి పూజలు చేసిన తర్వాత ఒక ఫీట్ ముందుకు లాగి రథాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎల్‌నినో గండం నుంచి రక్షించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. వారి వెంట డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డి ఉన్నారు.
ఏడో రోజుకు చేరిన నవరాత్రి ఉత్సవాలు
ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం ఏడో రోజుకు చేరాయి. ప్రధానార్చకుడు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత పూజలు, నిత్యాహ్నికం జరిపి అమ్మవారి మూలమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించారు. స్నపనమూర్తికి ఉదయం కాళరాత్రి, సాయంత్రం రక్తబీజహా క్రమాల్లో పూజలు చేసి రథోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయాల అభివృద్ధి అభినందనీయం
వరంగల్ నగరం ప్రాచీన కట్టడాలు, ఆలయాలకు నిలయమని, ఈ ప్రాంత వారసత్వ సంపదను కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం మంత్రి శ్రీధర్‌బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. శ్రీరుద్రేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం అర్చకులు వారికి మహాదాశీర్వచనం చేశారు. అనంతరం వారు దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సరస్వతీదేవిగా శ్రీరుద్రేశ్వరీదేవి అమ్మవారు
శ్రీరుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు శనివారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. మహాచండీయాగం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు
హాజరైన ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని


