● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం అందిన 19 వేల దరఖాస్తుల్లో 45 పరిష్కరించామని, సుమారు 780 దరఖాస్తులు ఏఈఆర్ఓ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మిగిలిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులకు కేటాయించామని, ప్రతీ రోజూ ప్రక్రియను పర్యవేక్షిస్తూ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. సమావేశంలో ఏఈఆర్ఓ రవీందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, డీసీఓ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రేటర్ వరంగల్ నగర ప్రజలకు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ వెంకన్న తెలిపారు. శనివారం కమిషనర్ నగర పరిధి వివిధ బతుకమ్మ ఘాట్లు, చెరువులు, కుంటలు, కృత్రిమ నీటి కొలనుల వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో 90 ప్రాంతాల్లో రూ.1.50 కోట్లతో సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నిరంతరం పర్యవేక్షించాలి..
నగరంలోని కాళోజీ కళాక్షేత్రం నుంచి అదాలత్ జంక్షన్ వరకు, పలు ప్రాంతాల్లో కమిషనర్ వెంకన్న శనివారం ఉదయం పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఈసందర్భంగా నగర ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో కమిషనర్ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవికుమార్, సంజయ్ కుమార్, మహేందర్, మాధవి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, సీఏంహెచ్ఓ రాజారెడ్డి, సిటీప్లానర్ రవీంద్ర రాడేకర్ తదితరులున్నారు.


