● 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21న ఉదయం వరకు అమలు
● దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
హసన్పర్తి: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న దసరా ఉత్సవాలకు ట్రైసిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ శ్వేత తెలిపారు. ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం నుంచి 21వ తేదీ తెల్ల వారుజామున 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి, పోలీసులకు సహకరించాలని కమిషనర్ శ్వేత కోరారు.
ప్రత్యామ్నాయ మార్గాలివే..
● ఖమ్మం నుంచి కరీంనగర్, హైదరబాద్కు వెళ్లే వాహనాలు.. పున్నేలు క్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్ వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి.
● కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు.. కేయూసీ జంక్షన్, పెద్దమ్మ గడ్డ, హనుమాన్ జంక్షన్, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్ రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్లాలి.
● హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపునకు వెళ్లే వాహనాలు.. కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్, మీదుగా వెళ్లాలి.
ఉర్సు గుట్టకు వచ్చే వాహనాల పార్కింగ్ ఇలా..
● హంటర్ రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలు.. ఫాదర్ కొలంబో ఆస్పత్రి, బీఆర్ నగర్ ఎదురుగా గానుగ ఆయిల్ పాయింట్ వద్ద ఆకుతోట ఫంక్షన్ హాల్, నాని గార్డెన్, జీఎస్ఎం స్కూల్ వద్ద వాహనాలు పార్కింగ్ చేయాలి.
● కడిపికొండవైపు నుంచి వచ్చే వాహనాలు.. భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో పార్కింగ్ చేయాలి.
● ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు.. లవ్లీ ఫంక్షన్ హాల్ ఖాళీ స్థలం, తాళ్ల పద్మావతి కళాశాల సమీపంలో పార్కింగ్ చేయాలి.
● కరీమాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు.. బీరన్న గుడి సమీపంలో పార్కింగ్ చేయాలి.


