ఇద్దరు ఆడపిల్లలు.. డాక్టర్లే..
కూతురును చూసి గర్వపడుతున్నాం..
హన్మకొండ : నిన్నుచూసి మేం తల్లిదండ్రులుగా ఎంతో గర్వపడుతున్నాం. కూతురు సహనా రెడ్డి చిన్ననాటి నీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆనందం పొందుతున్నాం. విద్య అనేది భవిష్యత్తును మార్చే శక్తి అని ధృడంగా నమ్మి మా కూతురును చదివించాం. కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. మల్టీ నేషనల్ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలో ఏడాదికి రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తూ సమాజంలో ఉన్నత స్థాయిలో నిలవడం మాకెంతో గర్వకారణం. మా ఆనందం.. ఆశలకు ప్రతీక అయిన నీవు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతశిఖరాలను అధిరోహించాలని, నేటి సమాజానికి మార్గదర్శకురాలిగా నిలవాలని కోరుకుంటున్నాం.
– గోపు రేణుక, సమ్మిరెడ్డి, హనుమకొండ
కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి గాండ్ల ప్రభాకర్–రమాదేవికి ఇద్దరు కుమార్తెలు మౌనిక, మేఘన. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్నా చింత లేకుండా వారిని చదివించారు. పెద్దమ్మాయి మౌనిక కేఎంసీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉస్మానియా పరిధి నీలోఫర్ ఆస్పత్రిలో డీఎం నియోనెటాలజీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా చిన్నమ్మాయి మేఘన కూడా తానేమీ తీసిపోనట్లుగా ఒంగోలులోని రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం గుంటూరులోని మెడికల్ కాలేజీలో ఆప్తాల్మాజీలో సెకండియర్ చదువుతున్నారు. ‘మాకు కొడుకులు లేరన్న చింత లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టినా లక్ష్మీదేవిగా వారిని భావిస్తూ కష్టపడి చదివించాం. డాక్టర్లు కావడంతో మా జన్మ ధన్యమైంది.’అని తల్లిదండ్రులు ప్రభాకర్–రమాదేవి సగర్వంగా చెప్పారు.
నా పేరు డి.ప్రభాకర్.. మాది అశోక కాలనీ హనుమకొండ. మా బిడ్డ ప్రాంశుత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (MCJ) పూర్తి చేసింది. రెండు బంగారు పతకాలు సాధించి, గవర్నర్ చేతుల మీదుగా వాటిని ఈ ఏడాది సెప్టెంబర్ 8న అందుకున్న క్షణం మాకు ఎంతో గర్వకారణం.
జూనియర్
సివిల్ జడ్జిగా అశ్విని
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యది వ్యవసాయధార కుటుంబం. విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులు అనుభవించిన ఆ దంపతులు కూతురిని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు. వారి కలలకు అనుగుణంగా అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై బాధ్యతలు నిర్వరిస్తున్నారు. జడ్జిగా సేవలందిస్తున్న మా బిడ్డను చూస్తుంటే కడుపు నిండిపోతోంది అని పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు.
నా పేరు బొజ్జ మాధవి వేణుగోపాల్. మేం ఉండేది హనుమకొండ కాకతీయ కాలనీ. మాకు ఇద్దరు అమ్మాయిలు. భువన, చందన. పెద్దమ్మాయి 10 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. మా చిన్న కూతురు బీఫార్మసీలో గోల్డ్ మెడలిస్ట్. చదువు అయిపోగానే ఏడాది జాబ్ చేసి ఉన్నత చదువులకు కెనడా వెళ్లింది. అక్కడ చదువు పూర్తి చేసుకుని హెల్త్ అండ్ కేర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఉన్నతంగా బతకాలనే వారి ఆశయాలు, వాళ్ల ధైర్యాన్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాం.


