● జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ఎం.రామకృష్ణ సునీత
హన్మకొండ అర్బన్: వినికిడి లోపం ఉన్న పిల్లలు, దివ్యాంగులకు అవసరమైన వైద్య సేవలు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్ ఎం.రామకృష్ణ సునీత అధికారులను ఆదేశించారు. ప్రపంచ బధిరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మల్లికాంబ మనోవికాస కేంద్రంలో వినికిడి లోపం ఉన్న పిల్లలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఈఎన్‌టీ వైద్య శిబిరం నిర్వహించారు. మల్లికాంబ మనోవికాస కేంద్రం పిల్లలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.రామకృష్ణ సునీత, ఈఎన్‌టీ వైద్య నిపుణుడు డాక్టర్ సుదీప్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.రామలింగం, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.వెంకట హైమపూజిత, మల్లికాంబ మనోవికాస కేంద్రం వ్యవస్థాపకురాలు బి.రామలీల, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఎం.ప్రదీప్, అదనపు జూనియర్ సివిల్ జడ్జిలు అనూష, శ్రీవల్లి శైలజ, మధులిక తేజ, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎస్.ప్రవీణ్‌కుమార్, ప్రొఫెసర్ పద్మ, బండ సదానందరావు, కొడం కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.


