నయా నిజాం పాలనను అంతం చేశాం.. | - | Sakshi
Sakshi News home page

నయా నిజాం పాలనను అంతం చేశాం..

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

నయా నిజాం పాలనను అంతం చేశాం..

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

హన్మకొండ అర్బన్‌: సెప్టెంబర్‌ 17న నైజాం రాచరిక పాలననుంచి తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందని, ఆదేమాదిరిగా 33 నెలల క్రితం రాష్ట్రంలో నయా నిజాం పాలనకు ప్రజలు చరమగీతం పాడి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు పదేళ్లపాటు జరిగిన అరాచకాలు మామూలుగా లేవన్నారు. ప్రశ్నించిన వారిని హింసించడం, కేసులు, జైళ్లు, వేధింపులు వంటి ఎన్నోరకాల నిర్భంధాలకు గురిచేశారన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనతో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీస్‌ పరేడ్‌ వందనం స్వీకరించి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, పోలీస్‌ కమిషనర్‌ శ్వేత, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, బల్దియా కమిషనర్‌ వెంకన్న, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ తరహా అభివృద్ధి

హనుమకొండ–వరంగల్‌ నగరాలను హైదరాబాద్‌–సికింద్రాబాద్‌ తరహాలో అభివృద్ధి చేసి రాజధానికి దీటైన నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగరంలో తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి రూ.551 కోట్లు కేటాయించామని, బల్దియా పరిపాలనా భవనానికి రూ.32 కోట్లు, వీధి దీపాల వ్యవస్థకు రూ.30 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. 45 కిలోమీటర్ల పొడవున 200 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.572 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

రోడ్లు, వంతెనలు..

మౌలిక వసతులపై దృష్టి

జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతోపాటు పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ.574 కోట్లు, హైబ్రిడ్‌ యాన్యుటీ విధానంలో రహదారుల అభివృద్ధికి రూ.255 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో 862 అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు.

విద్యాసంస్థలు..

వారసత్వ నగరంగా వరంగల్‌

జిల్లాలో నాలుగు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని, రెండు యువ భారత సమగ్ర గురుకుల పాఠశాలలకు అనుమతి లభించడంతో పనులు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి భవన్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

దేవాదుల జలాలతో సాగు,

తాగునీటికి భరోసా

రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా దేవాదుల ద్వారా ధర్మసాగర్‌, చలివాగు ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తున్నామని మంత్రి చెప్పారు. ధర్మసాగర్‌ ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా చెరువులు, కుంటలను నింపి ఖరీఫ్‌ పంటలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ పాలన కొనసాగిస్తోందన్నారు.

వరంగల్‌ చౌరస్తా: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మనస్సును గెలుచుకుందని తెలంగాణ ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. వరంగల్‌ రాంకీ మైదానంలో గురువారం జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అనంతరం ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛ కోసం యావత్‌ సమాజం ఉద్యమించిందని గుర్తుచేశారు. ఆ అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోతాయని కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వందలాది మంది బలిదానాలు, విద్యార్థుల అలుపెరుగని పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలందరికి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం వైపు కాంగ్రెస్‌ ప్రభుత్వం పయనిస్తోందని స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తోందని అన్నారు.

ముమ్మరంగా భూ రీసర్వే

జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని, ఆధునిక పరికరాల సహాయంతో ఇప్పటివరకు 13 గ్రామాల్లో 5,180 ఎకరాలకుపైగా డిజిటల్‌ సర్వే పూర్తయిందని చెప్పారు. వాటిలో 4 గ్రామాల్లో భౌతిక తనిఖీ పూర్తయిందని, మిగిలిన 9 గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాపాలన, రైతు భరోసా, భూభారతి, బ్యాంకు లింకేజీ, జిల్లా పంచాయతీలు, ఆహార భద్రత తదితర సంక్షేమ పథకాలపై విజయలక్ష్మి సవివరంగా వెల్లడించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవలో కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌ తీరుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్‌ ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్‌ రెడ్డిపై చేసిన ఆరోపణలను మీసాల ప్రకాశ్‌ ఖండించకపోవడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు పరమేష్‌, నాయకుడు బాబు అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న కలెక్టర్‌ సత్యశారద.. ఇరువర్గాలు శాంతించాలని కోరడంతో సమస్య సద్దుమణిగింది.

పడమరకోటలో

అమరవీరుల స్తూపం వద్ద నివాళి

ఖిలా వరంగల్‌: పడమర కోట జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదతో కలిసి గద్వాల విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, మేర కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకట్రాజం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అయూబ్‌, అదనపు కలెక్టర్లు గణేశ్‌, కిశోర్‌ కుమార్‌, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ గజ్జెల శ్యాం తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళికి విజయలక్ష్మి పూజలు..

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని గద్వాల విజయలక్ష్మి సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు అందించారు.

ఆలస్యంగా..

ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ అంటూ అధికారికంగా సమాచారం ఇచ్చినప్పటికీ సుమారు గంట ఆలస్యంగా కార్యక్రమం ప్రారంభమైంది. ఇక వేదిక పైకి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ను పిలవక పోవడంపై ప్రొటోకాల్‌ పాటించలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు వివరణ ఇవ్వడంతో సద్దుమణిగింది.

సర్వేయర్లకు కిట్ల పంపిణీ..

న్యూశాయంపేట: హనుమకొండ ఐడీఓసీ ప్రాంగణంలో వరంగల్‌ జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శాఖ ఆధ్వర్యంలో రీసర్వేలో భాగంగా లైసెన్డ్‌ సర్వేయర్లకు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా కిట్లను అందజేశారు.

33 నెలల క్రితం ప్రజా ప్రభుత్వం ఏర్పడింది

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగుతోంది

ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఘనంగా జాతీయ పతాకావిష్కరణ,

తెలంగాణ అమరవీరులకు నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement