● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
హన్మకొండ: సామాన్యుల నడ్డివిరిచేలా కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై చార్జీల భారం మోపుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం హనుమకొండ కాళోజీ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యూపీఐ చెల్లింపులపై చార్జీలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చెల్లింపులపై చార్జీల బాదుడు మానుకోవాలని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సామాన్యులపై భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరి నశించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. కొన్నేళ్లుగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం, తాజాగా యూపీఐ లావాదేవీలపై చార్జీలు వసూలు చేయడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, ఎన్.అశోక్ స్టాలిన్, నేదునూరి రాజమౌళి, ఏదునూరి వెంకట్రాజం తదితరులు పాల్గొన్నారు.


