ఏటూరునాగారం : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఈనెల 17వ తేదీన సెలవు ఇస్తూ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంప్రదాయ పండుగ ‘పెద్దల పండుగ’ ఈనెల 17న నిర్వహించుకునే అవకాశం ఉండడంతో వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించామని, ఈ సెలవును అక్టోబర్ 10వ తేదీ రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల హెచ్‌ఎలు, వార్డెన్‌లు ఈ ఉత్తర్వులను పాటించాలని ఆదేశించారు.
మక్కలకు రికార్డు ధర
● క్వింటాల్‌కు రూ.2,750 రేటు
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసా య మార్కెట్ యార్డులో మక్కలకు రికార్డు ధర పలికింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు మార్కెట్‌కు వరుస సెలవులు రాగా.. మంగళవారం పునః ప్రారంభమైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన రాజారపు పోశాలు 18 బ స్తాల మక్కలు మార్కెట్‌కు తీసుకొచ్చారు. మా ర్కెట్‌లోని ఓ వ్యాపారి క్వింటాల్‌కు రూ.2,750 ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజనల్‌లో మక్కలకు మంచి ధర రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు..
కాజీపేట: వృద్ధాప్యం వయోవృద్ధులకు శాపంగా మారకూడదని, వారి సంరక్షణ బాధ్యతలను కన్నవారే చూసుకోవాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి నేరెళ్ల వెంకట హైమ పూజిత అన్నారు. కాజీపేట 61వ డివిజన్ ప్రశాంత్‌నగర్ కాలనీలోని సహృదయ అనాథ ఆశ్రమంలో మంగళవారం వృద్ధుల పోషణ, రక్షణ చట్టంపై వృద్ధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల నిరాదరణకు గురైతే ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయిస్తే ఉచితంగా న్యాయ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో డాక్టర్ కె.అనితారెడ్డి, సహృదయ ఆశ్రమ నిర్వాహకులు ఎండీ యాకూబీ, చోటు, రవి తదితరులు పాల్గొన్నారు.


