● గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: పెద్ద మొత్తంలో పన్ను బకాయిలు ఉన్న డిఫాల్టర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్నుల విభాగం సర్కిళ్ల వారీగా శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పన్నుల వసూళ్ల లక్ష్యాలను సర్కిల్, వార్డుస్థాయిలో విభజించి, రోజువారీ పురోగతిని తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. కొత్త అసెస్‌మెంట్లు, పెండింగ్ బకాయిలు, వీఎల్‌టీ, డబుల్ అసెస్‌మెంట్లు, కమర్షియల్ భవనాలను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం కూల్చిన భవనాల ఇంటి నంబర్లను గుర్తించి పూర్తి వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. పన్ను వసూళ్లను పెంచడానికి త్వరలోనే వార్డు ఆఫీసర్లు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, ప్రసన్నరాణి, టీఓ రామకృష్ణ, ఐటీ మేనేజర్ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.


