ఉద్యోగుల ఆందోళన..
హన్మకొండ అర్బన్ : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ధర్నాలో ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు ప్రజాసంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. అధికార పార్టీ నేతలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వగా, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. భారీగా ఉద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ పరిసరాలు జనసందోహంగా మారాయి. హనుమకొండ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ఈసందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడుతూ ఆరు డీఏలు విడుదల చేయడం, మెరుగైన పీఆర్సీ ప్రకటించడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను కూడా ఆలస్యం చేయకుండా అందించాలని డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారని తెలిపారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతిపత్రం అందజేశారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం
సానుకూలం: ఎమ్మెల్యే నాయిని
ధర్నాకు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఇప్పటికే చర్చించానన్నారు. రెండో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పాత పెన్షన్ విధానం, హెల్త్‌కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర అంశాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని తెలిపారు.
ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉండడం సిగ్గుచేటన్నారు. ఈహెచ్‌ఎస్ పేరుతో ఉద్యోగుల జీతాల నుంచి డబ్బులు కట్ చేస్తున్నా ఆస్పత్రులతో ఒప్పందాలు లేక సేవలు అందడం లేదని ఆరోపించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయడంతోపాటు మెరుగైన పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
హాజరైన అన్ని ఉద్యోగ సంఘాలు..
సంఘీభావం తెలిపిన ప్రజాసంఘాలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాధర్నా.. అక్కడే భోజనాలు
అధికార, ప్రతిపక్ష నేతల హామీలు.. విమర్శలతో వేడెక్కిన వేదిక
మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్..
స్టేషన్‌కు తరలింపు


