హన్మకొండ : ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా వచ్చి.. ఎవరూ తీసుకెళ్లని వస్తువులను ఈనెల 29న మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేయనున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరమ్‌సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ హనుమకొండ డిపోలో నిర్వహించే ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు నేరుగా పాల్గొనవచ్చని సూచించారు.
కేయూ క్యాంపస్: హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈవిద్యాసంవత్సరం (2026–27)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ నిర్మల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు స్పాట్ అడ్మిషన్లకు ఆయా తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సంప్రదించి అడ్మిషన్లు పొందాలని కోరారు.
కాశిబుగ్గ: కేఎంసీలోని క్షయ నివారణ కేంద్రాన్ని హనుమకొండ ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టి.రోహిత్ నేత గురువారం సందర్శించారు. ఈసందర్భంగా క్షయ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానం గురించి ఇన్‌చార్జ్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా ఓపీ పేషెంట్ల సేవలు, ట్రునాట్ ల్యాబ్ గురించి తెలిపారు. కార్యక్రమంలో టీబీ, కల్చర్ ల్యాబ్ సిబ్బంది పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ కొనసాగుతోందని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఇప్పటివరకు 15,574 మందికి నోటీసులు అందించినట్లు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్‌ఐఆర్ పురోగతిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఈఆర్‌ఓ/ఆర్డీఓ వెంకటేశ్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్, రాజకీయ పార్టీల ప్ర తినిధులు ఎండీ.నేహాల్, కె.సంపత్‌రెడ్డి, కె.శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించాలని తెలంగాణ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ (టీజీఎస్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు సభ్యులు, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు దేవరకొండ సైదులు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఆ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సదస్సులో వివిధ జిల్లాల అధ్యక్షులు దిల్షాద్, గుండ యాదగిరి, షేక్ మన్సూర్, మంగ నర్సింహులు, సునీల్‌కుమార్, రవి, వృత్తి విద్య కాంట్రాక్టు అధ్యాపకులు, టీజీఎస్‌టీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ చీఫ్ ఇంజినీర్ ఎం.చైతన్యకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజీపేట, ఫాతిమానగర్, మచిలీబజార్, సుధానగర్, యాదవనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో హనుమకొండ, వరంగల్ జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ నాయక్, డీఈలు రవీందర్, కిషన్ నాయక్, విష్ణువర్ధన్, ఏఈలు, సీఎల్టీ సీలు, మేనేజర్లు పాల్గొన్నారు.


