హన్మకొండ అర్బన్: గౌరవెల్లి కాలువ, గ్రీన్‌న్ ఫీల్డ్ జాతీయ రహదారి, దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, సాగు నీటిపారుదల, జాతీయ రహదారుల శాఖ అధికారులతో భూసేకరణ, పరిహారం చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. వేలేరు, భీమదేవరపల్లి, ధర్మసాగర్ మండలాల్లో గౌరవెల్లి కాలువకు సేకరిస్తున్న భూముల్లో పెగ్ మార్కింగ్ పనులు సర్వేయర్లతో త్వరగా పూర్తి చేయాలన్నారు. భూభారతి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. భూముల రీసర్వేను కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓలు వెంకటేశ్, డీఎస్.వెంకన్న, హైవే పీడీ భరద్వాజ్, సాగునీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఏజీ మిల్లు మాజీ కార్మికులతో సమావేశం
న్యూశాయంపేట: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆజంజాహి మిల్లు మాజీ కార్మికుల సమస్య పరిష్కారానికి వరంగల్ కలెక్టరేట్‌లో శనివారం సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులు, పిటిషనర్లు, మాజీ కార్మికులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కుడా వైస్ చైర్‌పర్సన్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి, ప్రత్యామ్నాయాలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు కార్మికులు సమయం కోరినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు చేపడతామని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆజంజాహి మిల్లు మాజీ కార్మికులు పాల్గొన్నారు.


