‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు

Aug 23 2026 1:10 AM | Updated on Aug 23 2026 1:10 AM

‘ఉత్తమ’ అవార్డులకు దరఖాస్తులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి వికసిత్‌భారత్‌ లక్ష్యంగా విద్యనభ్యసించాలి స్పోర్ట్స్‌ సైన్స్‌లో శిక్షణ పొందిన సాట్‌ డీడీ బాధ్యతల స్వీకరణ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా స్థాయిలో విద్యాబోధనలో విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులు ‘ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో ఉత్తమ బోధనా పద్ధతులు అవలంబిస్తూ, విద్యార్థుల ప్రతిభావృద్ధికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నవారు, సమాజంలో విద్యా చైతన్యానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయుల నుంచి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 25 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండి తమ సేవలకు సంబంధించి ఆధారాలతో కూడిన ప్రతిపాదనలను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా హెచ్‌ఎంల ద్వారా పంపాలని సూచించారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాల్సిన గడువు ఈనెల 29 వరకు ఉందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులను సెప్టెంబర్‌ 5న అవార్డులు అందజేస్తామని తెలిపారు.

కేయూ క్యాంపస్‌: నిరంతర జ్ఞాన సముపార్జనే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రం విద్యార్థులను, పరిశోధకులను కోరారు. కేయూలోని కంప్యూటర్‌ సెంటర్‌లో యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మాస్యూటికల్‌ అండ్‌ అలైడ్‌ డిసిప్లిన్‌ ఆధ్వర్యంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ శనివారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న వారికి రిజిస్ట్రార్‌ రాంచంద్రం సర్టిఫికెట్లు అందించారు. వర్క్‌షాప్‌ డైరెక్టర్‌, ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రసాద్‌, అదనపు సంచాలకులు డాక్టర్‌ శాస్త్రి, పూణేకు చెందిన అడ్వెంట్‌ ఇన్ఫర్మేటిక్స్‌ లిమిటెడ్‌ బాధ్యులు డాక్టర్‌ దీపక్‌ శర్మ, డాక్టర్‌ సచికేత్‌ జోషి, డాక్టర్‌ షంషేర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు వికసిత్‌ భారత్‌లో భాగస్వామ్యమే లక్ష్యంగా విద్యనభ్యసించాలని నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ తెలిపారు. క్యాంపస్‌లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో శనివారం 68వ బ్యాచ్‌ యూజీ విద్యార్థులకు ఓరియెంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ హాజరై నూతన విద్యార్థులకు స్వాగతం పలికి మాట్లాడారు. క్యాంపస్‌లో అందుతున్న విద్య, వసతులు, ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కార్యక్రమంలో డీన్‌లు వెంకయ్యచౌదరి, కిరణ్‌కుమార్‌, ప్రొఫెసర్లు వాసు, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: వరంగల్‌ ఎన్‌ఐటీలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు ‘శారీరక విద్య, క్రీడా విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు, బహుళ విభాగాల విధానాలు’ అంశంపై స్వల్పకాలిక శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్‌ఐటీ వరంగల్‌ వ్యాయామ విద్యా విభాగ ప్రొఫెసర్‌ రవికుమార్‌ చేతుల మీదుగా స్పొర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్‌ గుగులోతు అశోక్‌ కుమార్‌ ప్రశంసపత్రం అందుకున్నారు. అశోక్‌కుమార్‌ను సాట్‌ ఎండీ సోనీ బాలాదేవి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు.

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌ జిల్లా కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న కె.పూజ పదోన్నతిపై శనివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ వరంగల్‌కు బదిలీ అయ్యారు. ఈసందర్భంగా కార్యదర్శి పూజకు న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి ఎ.ప్రదీప్‌, సూపరింటెండెంట్‌ మోహన్‌రావు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా హైమ పూజిత

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న హైమ పూజితను పదోన్నతిపై హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ మేరకు హైకోర్టునుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement