గుడిసెల తొలగింపు వినయ్‌భాస్కర్ పనే..
● ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ చౌరస్తా: భద్రకాళి ఆలయ మాడవీధుల అభివృద్ధిలో భాగంగా.. ఆలయ ప్రాంగణంలో ఉన్న దళితుల గుడిసెలను తొలగించేందుకు ఆజ్యం పోసిందే మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని 4వ డివిజన్ యాదవనగర్‌లోని కమ్యూనిటీహాల్‌లో శుక్రవారం ఆయన స్థానికులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గుడిసెలను తొలగించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వినయ్‌భాస్కర్ చేస్తున్న ఆరోపణలు, రాజకీయ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ ఆదేశాలతో ఫిబ్రవరి 14, 2023న దళితుల గుడిసెలను తొలగించాలని తీర్మానం చేశారన్నారు. దళితులను మోసం చేసి వారి గుడిసెల తొలగింపునకు పూనుకున్నది మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కరేనని, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గుడిసెవాసులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చి న్యాయం చేస్తోందన్నారు.


