భక్తులకు బస్సులు అందుబాటులో ఉంచాలి
● టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి
హన్మకొండ: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌తోపాటు హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని మేడారం ప్రత్యేక బస్ పాయింట్లను పర్యవేక్షించారు. క్యూ లైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. బస్సుల రాకపోకల వివరాలు అధికారులను ఆడిగి తెలుసుకున్నారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నందున, అదనపు బస్సులను సిద్ధం చేశామన్నారు. ఆర్‌ఎం దర్శనం విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్లు బి.ధరంసింగ్, పి.అర్పిత, రవిచంద్ర పాల్గొన్నారు.


