నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
● సకుటుంబసమేతంగా అమ్మవార్ల దర్శనానికి.. ● దశాబ్దాలుగా మేడారానికి వస్తున్న కుటుంబాలు
మేడారం (ములుగు): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అమ్మవార్లపై ఉన్న అపార నమ్మకంతో వస్తుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చే సమ్మక్క–సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అనాదిగా అమ్మవార్లపై ఎనలేని విశ్వాసాన్ని చూపుతూ రెండేళ్లకొకసారి జరిగే మహాజాతరకు కుటుంబసమేతంగా హాజరై తల్లుల చెంత నాలుగు రోజుల పాటు ఆధ్మాత్మిక సేద్యం చేస్తుంటారు. బుధవారం జాతరకు వచ్చి శనివారం సాయంత్రం దాక నాలుగు రోజులు ఇక్కడే గడుపుతారు. అవసరమైన ఆహార సామగ్రి, ఇతర వంట సరుకులు తెచ్చుకుంటారు. అమ్మవార్లు గద్దెలపై కొలువుదీరిన వెంటనే నిలువెత్తు బంగారాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చినందుకు యాటలను, కోళ్లలను బలిచ్చి చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకుంటారు. మేడారం జాతర జరిగే నాలుగు రోజుల పాటు పౌర్ణమి వెలుగుల్లో గుడారాలు వేసుకొని సమ్మక్క తల్లిని వేడుకుంటారు.
30ఏళ్లుగా జాతరకొస్తున్నాం..
అడవి బిడ్డలైన సమ్మక్క–సారలమ్మను భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. 1998 నుంచి ప్రతీ రెండేళ్లకొసారి మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటాం. అమ్మవార్ల మహిమను, మహాత్మ్యాన్ని స్నేహితులకు కూడా తెలియజేయడంతో వారు కూడా మేడారం జాతరకు వస్తున్నారు. అమ్మవార్లను నమ్ముకుంటే అనుకున్న పని జరుగుతుందని స్నేహితులు కూడా చెప్పారు.
– దామెర రాజు, సికింద్రాబాద్
ఙ
అమ్మవారి ఆశీస్సులతో బాబు పుట్టాడు..
తల్లుల మహిమల గురించి విని జాతరకు వచ్చి పెళ్లి కావాలని అమ్మవార్లకు మొక్కులు చెల్లించాను. దీంతో మరుసటి జాతర వచ్చేలోపు వివాహం జరగడమే కాకుండా బాబు పుట్టాడు. దీంతో కుటుంబ సమేతంగా మేడా రం చేరుకొని బాబు పుట్టువెంట్రుకలను మేడారంలోనే తీశాం. 20 ఏళ్లుగా ప్రతీ మేడారం జాతరకు వస్తూ ఎన్ని ఇబ్బందులైనా నాలుగు రోజుల పాటు మేడారంలో ఉండి అమ్మవార్లు గద్దెల పైకి వచ్చిన తర్వాత మొక్కులు చెల్లిస్తున్నాం.
– వెంకటగిరి కిశోర్‌బాబు, అమీర్‌పేట, హైదరాబాద్
నాలుగు రోజులు ఉంటం..
16 ఏళ్లుగా మేడారం జాతరకు వస్తున్నాం. కష్టాలు తీర్చమని అమ్మవార్లను వేడుకుంటాం. కోరికలు నెరవేర్చాలని అమ్మవారికి పూజలు నిర్వహిస్తాం. కోరికలు నెరవేరిన వెంటనే అమ్మవార్లకు యాటపోతులను బలిస్తాం. ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారానికి కుటుంబంతో కలిసి రావడం ఆనందంగా ఉంటుంది. జాతరలో సౌకర్యాలు ఉన్నా లేకున్నా..నాలుగు రోజు పాటు ఉండి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తాం. సరిపడా వంట సరుకులు తెచ్చుకుంటాం. నాలుగు రోజులుంటేనే మనసు నిమ్మలంగా ఉంటుంది.
– వరికుప్పల పుష్ప, పాలకుర్తి, జనగామ
నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!
నాలుగురోజులుంటేనే మనసు నిమ్మలం!


