జాతీయస్థాయిలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
వరంగల్ స్పోర్ట్స్: దేశంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడా ఎంపిక పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్‌కుమార్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎంపికలు అట్టహాసంగా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీవైఎస్ఓ అశోక్‌కుమార్ లాంఛనంగా పోటీలను ప్రారంభించి క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ ఎంపికలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ తెలంగాణ ఆదేశాలతో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధజిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు వివరించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చే నెల 15న ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయస్థాయి ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రెజ్లింగ్ కోచ్ కొండ నర్సింగరావు ను శాలువాతో ఘనంగా సత్కరించారు. అథ్లెటిక్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, రెజ్లింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్జాబ్రీ, స్విమ్మింగ్, రెజ్లింగ్ల సంఘాల జిల్లా కార్యదర్శులు స్వామిచరణ్, మహ్మద్ కరీం, సీనియర్ రెజ్లింగ్ కోచ్ నర్సింగరావు, డీఎస్ఏ కోచ్‌లు శ్రీమన్నారాయణ, జైపాల్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ డీవైఎస్ఓ అశోక్‌కుమార్
అట్టహాసంగా గిరిజన క్రీడాకారుల ఎంపిక పోటీలు


