సమగ్రాభివృద్ధే లక్ష్యం..
9
లోu
హన్మకొండ అర్బన్: ‘జిల్లాను వ్యవసాయ, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య, మహిళా సాధికారత, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం’ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ భారత గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ స్నేహ శబరీశ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రగతి నివేదికపై కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో హనుమకొండ జిల్లా పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
వ్యవసాయ రంగాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 1.58 లక్షల మంది రైతులకు రూ.157.23 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. రైతు బీమా పథకం కింద మరణించిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రతీ నెలా ఉచిత సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ లక్షలాది కుటుంబాలకు ఊరట కల్పిస్తున్నామని చెప్పారు.
గృహ కల నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్లు
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణంలోనూ గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. మహిళల సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద జిల్లాలో కోట్ల సంఖ్యలో జీరో టికెట్ ప్రయాణాలు నమోదైనట్లు తెలిపారు.
విద్యలో నాణ్యతపై దృష్టి
జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 96 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని తెలిపారు. కేజీబీవీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా లక్షలాది పని దినాలు కల్పించి కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. వన మహోత్సవం కింద లక్షల సంఖ్యలో మొక్కలు నాటామని చెప్పారు.
మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్–2041 అమలుతో పట్టణాభివృద్ధికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, కళాక్షేత్రాలు, జంక్షన్ల అభివృద్ధి వంటి కీలక పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.
ఉత్తములకు ‘ప్రశంస’లు..
విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సామాజిక సేవలు అందించిన పలువురికి కలెక్టర్ ప్రశంస పత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. డీఆర్డీఓ, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య, టెస్కో, హౌజింగ్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవితతో కలిసి తిలకించారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్‌ఓ వైవీ గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గణతంత్ర వేడుకల్లో హనుమకొండ
కలెక్టర్ స్నేహ శబరీష్
ఉత్తమ ఉద్యోగులు, సామాజిక సేవలందించిన పలువురికి ప్రశంస పత్రాలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
ఉత్తములకు ప్రశంసలు
మరిన్ని ఫొటోలు..
సమగ్రాభివృద్ధే లక్ష్యం..


