నాడు రెండు రోజులు.. నేడు 45 నిమిషాల ప్రయాణం
మేడారం మహాజాతరకు తరలివెళ్తున్న భక్తజనం
ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి: కీకారణ్యంలో కొలువై ఉన్న వనదేవతలను దర్శించుకునేందుకు నాడు లక్షలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లు కట్టుకొని రెండు రోజుల ముందే మేడారం జాతరకు బయలుదేరేవారు. గ్రామాల్లో ఎడ్లబండ్ల చక్రాలు, బండికానీలకు రంగులు వేసి, ఎడ్ల కొమ్ములకు రంగురంగుల రిబ్బన్లను చుట్టి ముస్తాబు చేసేవారు. ఎడ్లబండిని గుడారంగా తయారు చేసుకునే బయలుదేరేవారు. ఎడ్లకు సైతం కావాల్సినంత ఎండుగడ్డి మోపును బడిలో వేసుకొని వచ్చేవారు.
చెట్లే గుడారాలు..
అడవిమార్గంలో జాతరకు వెళ్లే భక్తులు చెట్లనే గుడారాలుగా మల్చుకొని అక్కడే విడిది చేసేవారు. స్థానిక అడవుల్లో లభించే వెదురు కర్రలతో బండ్లకు పందిళ్లను వేసుకొని చీరలను అడ్డుగా కట్టుకునేవారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఊరట్టం, కన్నెపల్లి, నార్లాపూర్, పడిగాపూర్, ఎలుబాక, మేడారం ప్రాంతాల్లోనే బస చేసేవారు.
అడవి మార్గంలో మేడారానికి..
ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు అడవిమార్గంలో ఎడ్ల బండిలో పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా ప్రయాణం సాగించేది. రాత్రి వేళ అడవుల్లో నెగడ్లు పెట్టుకొని అక్కడ బస చేసి తెల్లవారి మేడారానికి బయలుదేరేవారు. మంగళవారం సాయంత్రానికి జంపన్నవాగుకు చేరుకొని అక్కడ స్నానాలు, తలనీలాలను సమర్పించి నిద్రచేసేవారు. తెల్లారి బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించేది. ఆరోజు రాత్రి ఇక్కడ నిద్ర చేసి శుక్రవారం రాత్రి బయలుదేరి వారి గ్రామాలకు బయలుదేరేవారు.
ఇంటికాడి నుంచే యాటపోతు, నాటు కోళ్లు
ఎడ్ల బండిలో బయలుదేరిన భక్తులు ఇంటి నుంచి యాటపోతులు, నాటుకోళ్లు, ఆహారం పదార్థాలు, వంట పాత్రలు, నీటి బుర్రలతో జాతరకు వచ్చేవా రు. అడవిలో విడిది చేసి సారలమ్మ వచ్చిన రోజు యాట పోతులను కోసి అమ్మవారికి మొక్కు చెల్లించేవారు. తిరుగు ప్రయాణం శుక్రవారం కోడి కొసుకొని చల్లంగా చూడు తల్లి అని పయనమయ్యేవారు.
తంబి హెలికాప్టర్ సేవలు..
ఎడ్లబండి నుంచి మారుతున్న కాలానికి అనుగుణంగా భక్తులు హెలికాప్టర్‌లో సైతం మేడారం జాతరకు వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆ కాలంలో రెండు రోజుల ప్రయాణం చేసిన భక్తులు ఇప్పుడు హెలికాప్టర్‌లో 45 నిమిషాల నుంచి గంటలోపు అమ్మవార్లను దర్శించుకొని మేడారం ఏరియల్ సర్వే చేసి తిరుగు ప్రయాణం అవుతున్నారు. హెలికాప్టర్‌లో వచ్చిన భక్తులకు ప్రత్యేక దర్శనం చేయిస్తున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఖర్చు ఎక్కువ అయినప్పటికీ భక్తులు సౌకర్యాలపై మొగ్గు చూపుతున్నారు. దాంతో తంబి హెలికాప్టర్ సర్వీస్‌లను కొనసాగిస్తోంది.
కాలినడక నుంచి కార్ల వరకు..
మేడారం జాతరకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల భక్తులు ఒక రోజు ముందు సద్దికట్టుకొని జాతరకు చేరుకునేవారు. కోడి కూయగానే ఇంటివద్ద స్నానాలను చేసుకొని కాలినడకన అడవి మార్గం, ఎడ్లబండ్ల దారుల నుంచి నడుచుకుంటూ మేడారం జాతరకు చేరుకునేవారు. వచ్చే దారిలో చీకటి పడితే ఆ ఇంటి వద్ద ఒక కునుకు తీసి మళ్లీ ప్రయాణాన్ని సాగించేవారు. తెచ్చుకున్న సద్దిమూటలే తిని సేద దీరేవారు. అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణాలు జరగడంతో అనేక మంది భక్తులు వాహనాలు, కార్లు, బైక్‌లపై మేడారానికి తరలివస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోదావరి నదిని పడవల ద్వారా దాటేవారు. ఎడ్లబండ్లను కాలిరేవు ఉన్న గోదావరి నీటిలో నుంచి దాటించేవారు. అలా వారి ప్రయాణం సాగేది. ఇప్పుడు గోదావరి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించడంతో అనేక మంది భక్తులు వాహనాల్లో తరలివస్తున్నారు. దీంతో ప్రయాణ మార్గం సులభతరంగా మారింది.
రెండు రోజుల ప్రయాణం..
మేడారం జాతరకు ఎడ్లబండిలో రెండు రోజుపాటు ప్రయాణం చేసే వాళ్లం. జాతర ముగిసే వరకు అక్కడే వండుకొని తినే వాళ్లం. అడవి మార్గంలో వెళ్లే వాళ్లం. అందరం కలిసి ఉంటూ వనదేవతలను దర్శించుకొని తిరుగు ప్రయాణం చేసేది. అప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సంతోషంగా గడిపేవాళ్లం.
– బలభద్ర రవీందర్, ఏటూరునాగారం


