ఓరుగల్లు ఉద్యమాల గడ్డ
● ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ
న్యూశాయంపేట/రామన్నపేట : ఓరుగల్లు ఉద్యమాల గడ్డ.. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వరంగల్ ప్రజలు ఐక్యంగా ఉండి ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగేలా అడుగులు వేయడం అబినందనీయమని ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆదివారం రాత్రి వరంగల్ ఎంజీఎం సమీప ఇస్లామియా గ్రౌండ్‌లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈనెల 22న మహిళలతో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 25న రాష్ట్ర హ్యూమన్ చైన్(మానవహారం), జూన్ 1న ఇందిరా పార్కు వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సభలో బీఆర్‌ఎస్ నాయకులు సోహైల్, ముస్లిం మత పెద్దలు మీర్ ఇద్రిసాలీ, ఉమర్ అబేదిన్, మౌలానా ఫసీయోద్దీన్ ఖాస్మీ, జలీల్‌ఖాన్, సయ్యద్ అబ్దుల్ సుబాన్, అబ్దుల్ ఖుద్దుస్, సయ్యద్ మసూద్, జుబేర్, సీపీఐ, న్యూడెమోక్రసీ నాయకులు మేకల రవి, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభలో అధిపత్య పోరు
ఈ బహిరంగలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య అధిపత్య పోరు కనిపించింది. తమను సభా వేదికలో ప్రసంగించకుండా అడ్డుకుంటున్నారని ఇరు పార్టీల మద్దతుదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లా బోర్డు పెద్దలు కలుగజేసుకుని వివాదాన్ని సద్దుమణిగించేలా చేశారు.
సెల్‌ఫోన్ లైట్లతో మద్దతు
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభకు హాజరైన ముస్లింలు సెల్‌ఫోన్ లైట్లు వెలిగించి మద్దతు తెలిపారు. సభ ప్రారంభంలో పహల్గాం ఉగ్రవాద దాడితో మృతిచెందిన భారతీయులకు, యుద్ధంలో మృతి చెందిన సైనికుల మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.


