
భాషా పండితుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి
విద్యారణ్యపురి: భాషా పండితుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. పదోన్నతులు పొందని భాషా పండితులు, ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ అబ్దులా హనుమకొండలోని పీఆర్టీయూ భవన్‌లో శ్రీపాల్‌రెడ్డిని శనివారం కలిశారు. పలు సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భాషా పండితుల్లో పదోన్నతులు రాని వారు కూడా ఉన్నారని వారందరికీ పదోన్నతులు కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలితశ్రీహరి, రాష్ట్రీయ పండిత పరిషత్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎఫ్‌ఎస్ అలీ, రాష్ట్ర బాధ్యులు లక్ష్మీనారాయణ, నడికూడ మండల విద్యాధికారి హనుమంతరావు, బాధ్యులు జక్కం దామోదర్, చక్రవర్తులు, గౌస్‌పాషా తదితరులు పాల్గొన్నారు.