పూడికతీత పక్కా ప్రణాళికతో చేపట్టండి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్: మహానగరం వరద ముంపునకు గురవకుండా నాలల పూడికతీత ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, అధికారులతో వర్షాకాలంలో మహా నగరం వరద ముంపునకు గురవకుండా నివారణ నిమిత్తం ముందస్తుగా చేపట్టాల్సిన నాలాల పూడికతీత తదితర చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధి అన్ని డివిజన్లలో ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రధాన నాలాలు పరిశీలించి పూడికతీత కోసం ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. వడ్డేపల్లి, భద్రకాళి, నయీంనగర్, బొందివాగు, సాకరాశికుంట ప్రధాన నాలాలతో పాటు 33 ప్రధాన నాలాలు, యూటీలు, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల పూడికతీత పనులకు వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాకాలం ప్రారంభం కాకముందే పూడికతీత పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాసరావు, రవికుమార్, సంతోశ్‌బాబు, మాధవి, డీఈలు రాజ్‌కుమార్, రంగారావు, సారంగం, కార్తీక్‌రెడ్డి, ముజమ్మిల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.


