ఆక్సిజన్‌ కుంభకోణంపై సీఐడీ చార్జ్‌షీట్‌! | - | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్‌ కుంభకోణంపై సీఐడీ చార్జ్‌షీట్‌!

Jul 22 2023 1:24 AM | Updated on Jul 22 2023 10:03 AM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్‌ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్‌ టెండర్‌ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్‌ టెండర్‌ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులతోపాటు వరంగల్‌ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

సంచలనంగా మారిన ఆక్సిజన్‌ దందా...

ఆక్సిజన్‌ కాంట్రాక్టర్‌ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్‌ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్‌ కాంట్రాక్టర్‌ లక్షల రూపాయలు సూపరింటెండెంట్‌కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్‌ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్‌, సీఐడీ విచారణకు ఆదేశించింది.

అధికారులపై కేసు నమోదు..

ఆక్సిజన్‌ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్‌రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్‌ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్‌ రఘురాం, అశోక్‌కుమార్‌, ఏ.ఎన్‌.ఆర్‌ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్‌రావు, తుంగతుర్తి సురేందర్‌, డాక్టర్‌ సత్యదేవ్‌, నరేంద్రకుమార్‌, బెంజీమెన్‌ సామెల్‌, కొండ్రు నాగేశ్వర్‌రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్‌ శేషాచారి నరసింహన్‌, వరికొటి విష్ణుమోహన్‌లను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేశారు.

కుంభకోణం వెలుగుచూసింది ఇలా...

ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్‌ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్‌ టెండర్‌ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది.

ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్‌ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్‌లో రూ.180కు లభించే ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఏకంగా డబుల్‌ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్‌ ‘టెండర్‌’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

ఈ కథనంలో సిలిండర్‌లో ఎంత కెపాసిటీ గేజ్‌తో ఆక్సిజన్‌ నింపాలి.. ఎంత గేజ్‌తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామకృష్ణ.. కాంట్రాక్టర్‌ మనోహర్‌రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్‌ మనోహర్‌రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్‌ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తీగ లాగితే డొంక కదిలింది..

ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్‌ పద్ధతిన టెండర్‌ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది.

ఒక్కో సిలిండర్‌కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement