ఆర్థిక ఇబ్బందుల్లో జెడ్పీలు పైసా నిధులు విదల్చని కూటమి ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేల తీరుతో ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంఘం నిధులపైనే ఆశలు
కూటమి పాలనలో నిర్వీర్యం
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ ఉండగానే ఆర్థికంగా ఇబ్బందులు తప్పలేదు. ఇప్పుడు మూడు జెడ్పీలుగా విభజించారు. ఇటీవల ఎన్నికల అనంతరం కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజలకు మేలు చేద్దామన్నా జెడ్పీ ఖాతాలో చిల్లిగవ్వ లేకపోగా.. బిల్లుల బకాయిలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇకనైనా మూడు జిల్లాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిధులు ఇవ్వాల్సి ఉంది.
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మూడుగా విడిపోయిన జిల్లా ప్రజా పరిషత్‌లకు కష్టకాలం ఎదురైంది. పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా కొత్తగా ఏర్పడిన జెడ్పీలు ఇంకా పూర్తిస్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించకముందే ఆర్థిక ఇబ్బందులను చవి చూస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కూడిన జెడ్పీ ప్రస్తుతం మూడుగా విడిపోయింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా పరిషత్‌లు ఏర్పడ్డాయి. ఆయా జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుతో పాటు జెడ్పీకి చెందిన ఆస్తులు, అప్పులు, ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన లోటును కేటాయించారు. ఏ జిల్లా పరిధిలోకి వచ్చే భూములు, వాణిజ్య దుకాణాలు, అతిథి గృహాలతో పాటు కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఓడ రేవులు, స్టాంప్ డ్యూటీ సర్ చార్జ్ కింద ఆదాయం ఆయా జెడ్పీలకు సమకూరుతుంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన, పెండింగ్‌లో ఉన్న నిధులను కొత్త జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘ నిధులపైనే ఆధారపడి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటు జెడ్పీల నిర్వహణకు సైతం నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన గత రెండున్నరేళ్ల కాలంలో జెడ్పీకి పైసా నిధులు విదల్చలేదు. దీంతో పాటు రాజ్యాంగం ప్రకారం హక్కుగా రావాల్సిన స్టాంప్ డ్యూటీ సర్‌చార్జ్ నిధులను సైతం ప్రభుత్వం తన ఖజానాలో జమ చేసుకోవడంతో స్థానిక సంస్థలైన జెడ్పీ, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు నిధుల కోసం ఇబ్బందులు పడుతున్నాయి.
2021లో వైఎస్సార్ సీపీ పాలనలో జెడ్పీని చేజిక్కించుకున్న అనంతరం అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు అటకెక్కాయి. జెడ్పీటీసీలకు ప్రాధాన్యమివ్వకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేసి, ఇష్టారాజ్యంగా పనులు కేటాయించారు. ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. జెడ్పీ ఆదాయానికి మించి పనులకు ఎడాపెడా ఆమోదం తెలిపారు. పూర్తి చేసిన పనులకు కూడా చెల్లించేందుకు నిధులు లేక జెడ్పీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.


