ఏకగ్రీవమైన 13వ వార్డు ఫారం–10 మాత్రం ‘సర్పంచ్’ పేరుతో అందజేత ఏకగ్రీవమైన వార్డు సభ్యుడికీ గుర్తు కేటాయింపు ప్రత్తిపాడు పంచాయతీలో ఆర్వో నిర్వాకాలు అయోమయంలో గ్రామస్తులు
సర్పంచ్ ఏకగ్రీవమంటూ..
ప్రత్తిపాడు: పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అలసత్వం ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తోంది. వార్డు ఏకగ్రీవమైతే సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైనట్లు ప్రకటించడం, ఏకగ్రీవమైన వార్డు సభ్యుడికి ఎన్నికల గుర్తును కేటాయించడం వంటి అంశాలు నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.
గుర్తు కేటాయింపు..
ఇదే పంచాయతీలో మరో విచిత్రం కూడా చోటుచేసుకుంది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ఫారం–9లో ప్రచురిస్తారు. కానీ ఇక్కడ 13వ వార్డులో ఒకే ఒక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వార్డు ఏకగ్రీవమైంది. రిటర్నింగ్ అధికారి మాత్రం ఆ అభ్యర్థికి కుక్కర్‌ను గుర్తుగా కేటాయించడం చర్చకు దారితీసింది. పోటీలో లేని వ్యక్తికి గుర్తు కేటాయించడంతో గ్రామస్తుల్లో అయోమయం నెలకొంది. గుర్తు ఎందుకు కేటాయించారో అర్థంకాక అభ్యర్థులు, ఇతర వార్డు సభ్యులు కూడా తలలు పట్టుకోవాల్సి వచ్చింది. రిటర్నింగ్ అధికారి అజరయ్య మాత్రం తాను అంతా కరెక్ట్‌గానే చేశానని, ఆ పీడీఎఫ్‌లో ఏముందో తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
ప్రత్తిపాడు రిటర్నింగ్ అధికారి అలసత్వంతో సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైపోయింది. అదేమిటనుకుంటున్నారా? అవును మరి. సందేహముంటే ఈ చిత్రాన్ని చూడండి. ప్రత్తిపాడు పంచాయతీలో మొత్తం 16 వార్డులున్నాయి. వాటిలో 13వ వార్డుకు షేక్ జానీబాషా ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఆ వార్డును అధికారులు ఏకగ్రీవంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏకగ్రీవ ఫలితాల ప్రకటనకు జారీ చేసే ఫారం–10లో మాత్రం ‘సర్పంచ్‌గా ప్రత్తిపాడు గ్రామ పంచాయతీకి షేక్ జానీబాషా ఏకగ్రీవమైనట్లు’ రిటర్నింగ్ అధికారి అజరయ్య పేర్కొన్నారు. పునఃపరిశీలన చేసుకోకుండా అధికారికంగా సంతకం చేసి, స్టాంపులు వేసి, పీడీఎఫ్‌గా మార్చి బయటకు ఇచ్చేశారు. దీంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. సర్పంచ్ స్థానం ఏకగ్రీవమవడం ఏమిటంటూ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.


