దొంగ ఓట్లను అడ్డుకున్న వారిపైనే దాడులు చేయడం దారుణం వైఎస్సార్ సీపీ మంగళగిరి సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి
మంగళగిరి రూరల్: అభివృద్ధి చేశామని అబద్ధపు ప్రచారం చేసుకుంటూ, పోలీసు అధికారులను, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి నారా లోకేష్ మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారని వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూరులో ఉన్న పార్టీ కార్యాలయంలో చినకాకాని గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి, గురువారం పోలింగ్ సందర్భంగా గ్రామంలో వైఎస్సార్ సీపీకి చెందిన యువకులపై మంగళగిరి రూరల్ పోలీసులు జరిపిన దాడుల గురించి వివరించారు. ఈ ఘటనపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వారు ముక్తకంఠంతో కోరారు. ఈ సందర్భంగా వేణుగోపాల సోమిరెడ్డి మాట్లాడుతూ, పెదవడ్లపూడి, నిడమర్రు, తాడేపల్లి, మంగళగిరి పట్టణంలోని పలు డివిజన్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. వారిని వదిలేసి, దొంగ ఓట్లను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా వ్యవహరించి పోలింగ్ నిర్వహించారని విమర్శించారు. నారా లోకేష్ తనకు 90 వేల మెజార్టీ వచ్చిందని చెప్పుకుంటూ, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని పోలింగ్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్, మంగళగిరి ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.
మహిళలని కూడా చూడలేదు...
చినకాకాని గ్రామంలో జరిగిన పోలీసు లాఠీచార్జి ఘటనపై గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు మాట్లాడుతూ, దొంగ ఓట్లను అడ్డుకున్న అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి, పోలింగ్ కేంద్రాలకు సుమారు 400 మీటర్ల దూరంలోని ఇళ్లలోకి ప్రవేశించి వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేశారని ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడటం అన్యాయమన్నారు. జలసూత్రం నాగరాజు మాట్లాడుతూ, ఎన్నికలకు వారం రోజుల ముందునుంచే మంగళగిరి రూరల్ పోలీసులు ఫోన్ చేసి, ఆధార్ కార్డులతో పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించినట్లు తెలిపారు. దొంగ ఓట్లు వేసిన వారిని వదిలేసి, వాటిని అడ్డుకున్న తమపై, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కాటంరాజు మాట్లాడుతూ, టీడీపీ నాయకుల ఆదేశాల మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి, ఇళ్లలోకి ప్రవేశించి దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల తీరును ఖండిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగళగిరి లీగల్ సెల్ ప్రతినిధి బాజీ గంగాధర్ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించిన అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామని, చట్టాన్ని అతిక్రమించిన అధికారులపై ప్రైవేటు కేసులు దాఖలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


