చిలకలూరిపేట: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ పంతంగి శ్రీనివాసరావు తెలిపారు. ప్రవేశ పరీక్ష శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటుందన్నారు. దీని కోసం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అమృతలూరు, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరు, మంగళగిరి, మాచర్ల, నరసరావుపేట, పిడుగురాళ్ల, రేపల్లె, సత్తెనపల్లి, తెనాలి, వినుకొండ పట్టణాల్లో 22 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 4,701 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఇప్పటికే వారి కోసం హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా జారీ చేసినట్లు తెలిపారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు గంట ముందుగానే సంబంధిత కేంద్రానికి హాల్ టికెట్‌తోపాటు, ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే నవోదయ విద్యాలయను 08647–255233 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఏపీఎస్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్ జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తిని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ శుక్రవారం కలెక్టర్ బంగ్లా రోడ్డులోని అటవీ శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరం వేదికగా ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టును నిర్వహించిన సందర్భంగా జస్టిస్ సత్యనారాయణమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు. క్యాంపు కోర్టులో భాగంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు సంబంధించి హెచ్‌ఆర్‌సీ వద్ద నమోదైన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణలతో పాటు నూతన కేసుల స్వీకరణ కార్యక్రమాలు చేపట్టారు.
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో శుక్రవారం అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన అత్యంత భక్తిశ్రద్ధలతో చేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు కార్యక్రమాన్ని జరిపించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన, బాలచాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. పవిత్ర కార్తిక మాసంలో పరమశివుని ఆరాధించి లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేస్తే శుభాలు కలుగుతాయని ఆలయ స్థానాచార్యుడు కౌశికచంద్రశేఖర శర్మ తెలిపారు. లక్ష బిల్వార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు.
మాచర్ల: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి సాగర్ కుడి కాలువకు శుక్రవారం జలవిద్యుత్ కేంద్రం ద్వారా 6,394 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు గురువారం అధికారులు, జెన్‌కో అధికారులు నీటి విడుదల చేశారు. ఇక రోజూ ఎనిమిది టీఎంసీలు విడుదల చేస్తారు. శుక్రవారం సాగర్ నీటి మట్టం 533.50 అడుగులుగా ఉంది. మొత్తం నిల్వ 590 అడుగులకు గాను 312.0450 టీఎంసీలు ఉండాలి. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నుంచి నీరు విడుదల లేదు. ఎస్‌ఎల్‌బీసీకి 2 వేలు, ఎల్‌ఎల్‌సీకి 600, ఎడమ కాలువకు 6478 క్యూసెక్కులు విడుదలవుతుంది. అవుట్ ఫ్లో 14,872 క్యూసెక్కులు కాగా, ఇన్‌ఫ్లో లేదు.


